కోవూరు భారీ పేలుడు తో ఉలిక్కిపడిన జనం
నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు సంభవించింది. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా లేక, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అని ఆందోళనకు గురయ్యారు. పేలుడు తర్వాత కరెంటు పోవడంతో చుట్టూ చీకట్లు అలముకున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. కోవూరు శ్మశానవాటిక సమీపంలోని బస్ షెల్టర్ లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. బస్ షెల్టర్ కూడా కుప్పకూలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.




















