Raisar Desert Camping: పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న బికనెర్ లోని రాయిసర్ ఎడారి, చారిత్రక కట్టడాలతో సహా ఆకర్షించేవి ఇవే
Rajasthan News | రాజస్థాన్ బికనెర్ లోని రాయిసర్ ఏడారి పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చారిత్రక కట్టడాలు, వంటకాలు, సఫారీలు, నైట్ క్యాంప్ సహా చాలా ఉన్నాయి.
How to Reach Raisar Desert Camp: రాజస్థాన్ లోని Bikaner నగరం పేరు వినగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేవి ఇసుక తిన్నెలు, ఒంటె సఫారీలు, రాజస్థానీ రుచికర వంటకాలు, అద్భుతమైన చారిత్రక కట్టడాలు.
1488లో రావు బికా స్థాపించిన బికానెర్ నగరం రాజస్థాన్ కళా సంపదకు ప్రతీకగా నిలుస్తోంది. జునాగఢ్ కోట, లాల్గర్ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ జరిగే సాంస్కృతిక ఉత్సవాలు, కళాప్రదర్శనలు పర్యాటకులకు ఈ నగర ప్రత్యేకతలను పరిచయం చేస్తాయి.
రాయిసర్ లోని డెసర్ట్ క్యాంపింగ్
భారతదేశపు అతిపెద్ద ఎడారి అయిన థార్ ఎడారిలో భాగమైన రాయిసర్ డెసర్ట్ క్యాంప్, బికానెర్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు నైట్ క్యాంపింగ్, ఒంటె సఫారీ, జీప్ సఫారీ, కల్బెలియా నృత్య ప్రదర్శనలు, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను ఆస్వాదించవచ్చు. రాయిసర్ లోని డెసర్ట్ క్యాంపింగ్ ఓ ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది.
ఏడారిలో జీవన విధానం
రాయిసర్ గ్రామ ప్రజలు ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడి తమ జీవనం సాగిస్తారు. ఒంటె సఫారీలు, క్యాంపుల నిర్వహణ, స్థానిక కళా ప్రదర్శనలు వారి జీవనాధారాలు. పర్యాటక సీజన్ (అక్టోబర్ నుండి జనవరి) లో ఉపాధి దొరుకుతున్నా, ఆఫ్-సీజన్‌లో ఈ ప్రాంత ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రాయిసర్ లోని ఓ స్థానిక మహిళ మాట్లాడుతూ, “పర్యాటకులు వస్తేనే మాకు మనుగడ సాగుతుంది. ఎడారి అందాలు చూడడానికి వచ్చే వారికోసం వారసత్వం గా వచ్చిన మా కళలను ప్రదర్శించడం మాకు గర్వంగా అనిపిస్తుంది. కానీ సీజన్ ముగిసిన తర్వాత ఉపాధి దొరకడం కష్టమే,” అని అన్నారు.
రాయిసర్ ఏడాదిలో పర్యాటకుల్ని ఆకర్షించేవి ఇవే
కల్బెలియా నృత్య ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్: ప్రతి సాయంత్రం డెసర్ట్ క్యాంప్‌లో రాజస్థానీ సంప్రదాయ కల్బెలియా నృత్య ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ రాయిసర్ పర్యటనలో మరింత ఆనందాన్ని చేరుస్తాయి.
ఒంటె, జీప్ సఫారీలు: ఇసుక తిన్నెల మధ్య ఒంటెపై ప్రయాణిస్తూ, సూర్యోదయం సూర్యాస్తమయం ను వీక్షించడం మరపురాని అనుభవం అవుతుంది. ఇక జీప్ సఫారీ విషయానికి వస్తె వేగంగా ఇసుక తిన్నెలలో ప్రయాణిస్తూ, సాహసోపేత జీప్ సఫారీ అనుభవించవచ్చు.
ఫేమస్ ఫుడ్
బికానెర్ లో రాజస్థానీ ఫుడ్ కూడా ఎంతో ఫేమస్. ముఖ్యం గా దాల్ భాటి చూర్మా, లాల్ మాంస్, కేర్ సంగ్రి, ఘేవర్ (రాజస్థానీ స్వీట్) ను టెస్ట్ చేసేందుకు పర్యాటకులు ఆశక్తి చూపిస్తారు.
విమానమార్గం ద్వారా: బికానెర్ విమానాశ్రయం రాయిసర్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు ద్వారా: బికానెర్ రైల్వే స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం కలిగి ఉంది.
రోడ్డు మార్గం ద్వారా: జాతీయ రహదారి 11 ద్వారా బికానెర్ సులభంగా చేరుకోవచ్చు. బికానెర్ నుండి రాయిసర్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు
రాయిసర్ డెసర్ట్ క్యాంప్‌లో గడిపిన ప్రతి క్షణం ఒక మరుపురాని అనుభవాన్ని అందిస్తుంది. ఎడారి లో సాయంకాలం వేళ చల్లటి గాలి, వెన్నెల రాత్రులు, లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, ఇసుక తిన్నెల మధ్య సాహసయాత్రలు, సంప్రదాయ కళలు, రుచికర వంటకాల తో కూడిన ఈ డెసర్ట్ క్యంపింగ్ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుంది.
Also Read: Viral News : మరి పెళ్లంటే అన్నీ చూసుకోవాలి బ్రో - వధువు కోసం ఓ మగాడిచ్చిన ప్రకటన వైరల్