Viral Video : సోషల్ మీడియా స్టార్ - ఈ కోతి గిన్నెలు తోముతుంది, చపాతీలు చేస్తుంది - యూట్యూబ్ వీడియోలతో రూ.5 లక్షల ఆదాయం
Viral Video : సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోన్న ఓ వీడియోలో ఇంట్లోని అన్ని పనులు చేస్తున్న కోతిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Viral Video : సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు షేర్ అవుతూంటాయి. అందులో చాలా వైరల్ కూడా అవుతూ ఉంటాయి. కొన్ని జంతువులు, అవి చేసే పనులు చాలా క్యూట్ గా అనిపిస్తాయి. అలాంటి వీడియోలను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇలాంటివి క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోవడం ఇటీవలి కాలంలో కామన్ అయిపోయింది. ఈ మధ్యే ఓ కుక్క తన ఇంటి యజమాని కూతుర్ని స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి ఓ బండి వేసుకుని వచ్చిన వీడియో వైరల్ కావడం చూశాం. అయితే తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆ కోతి మనం ఇంట్లో చేసే అన్ని పనులనూ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదు సాధారణంగా అయితే కోతులకు కోపమొస్తే.. దాన్ని ఇతరులపై ప్రదర్శిస్తాయి. కానీ ఇది మాత్రం తనను తానే గాయపర్చుకుంటుందట. ఇన్ని మంచి లక్షణాలున్న ఈ కోతికి ఓ పేరు కూడా ఉంది. అదే రాణి. దీంతో ఇప్పుడు దీన్ని అందరూ సోషల్ మీడియా స్టార్ అని పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి సమీపంలోని ఖాగీపూర్ సద్వా అనే చిన్న గ్రామంలో రాణి అనే ప్రత్యేకమైన కోతి నివసిస్తోంది. అది పుట్టింది కోతిగానే అయినా.. మనిషి చేసే అన్ని పనులూ చేస్తోంది. ఇతరులకు సహాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ ఈ కోతి అంటే ఎంతో అభిమానం ఏర్పడింది. రాణి ఎనిమిదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి అప్పటి నుంచి అశోక్, అతని కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఇది కాలక్రమంలో వారి దైనందిన జీవితంలో భాగమైంది. ఈ కోతి స్పెషాలిటీ ఏంటంటే.. ఇది కుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరిగానే ఇంట్లోని అన్ని పనులనూ చేస్తోంది. పాత్రలు కడగడం, చపాతీలు చేయడం, మసాలాలు రుబ్బడం వంటి పనుల్లో రాణి సహాయం చేస్తోంది. ఇంట్లోని ఆడవాళ్ళు వంట చేసినప్పుడల్లా, రాణి ఆత్రంగా వెళ్లి వారికి సహాయం చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
एक बंदरिया 🐒 काम वाली-
— Shahbaz Khan (@Shahbazkhan9557) December 30, 2024
यूपी के रायबरेली में रानी नाम की बंदरिया करती है घर के सभी काम,
रानी बंदरिया को बर्तन धुलना, खाना बनाना है पसंद,
खागीपुर संडवा की रानी का वीडियो सोशल मीडिया पर वायरल। @BeingSalmanKhan @kamaalrkhan @azizkavish @karishma_aziz97 @News18UP @priyarajputlive pic.twitter.com/NC3iz65w7k
రాణి కేవలం అశోక్ ఇంటికే పరిమితం కాలేదు. ఈ కోతి గ్రామంలోని ఇతర ఇళ్లను సందర్శించి వారిక్కూడా పనిలో సహాయం చేస్తుంది. కొన్నిసార్లు అది వారి ఇళ్లలో రోజువారీ పనిని పూర్తి చేసిన తర్వాత కూడా రాత్రి అక్కడే గడుపుతుంది. అశోక్ ఇల్లు దానికి ప్రధానంగా ఉండే ఇల్లు అయినప్పటికీ, అది తనకు నచ్చిన చోట తిరగడానికి, ఉండటానికి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. దీంతో రాణిని ఇప్పుడు గ్రామం మొత్తం అభిమానిస్తోంది, ఆరాధిస్తోంది. వాళ్లు ఎక్కడికెళ్లినా.. ఆ కోతిని కూడా తీసుకెళుతూ ఉంటారు. పడుకోవడానికి మంచం కూడా సిద్ధం చేస్తారట.
కోతి వీడియోలతో రూ.5 లక్షల ఆదాయం
రాణి అనే ఈ కోతి ఇప్పుడు అశోక్ కుటుంబానికి ఇంటి పనుల్లోనే కాదు ఆర్థిక విషయాల్లోనూ పాలు పంచుకుంటోంది. రాణి వీడియోలు తీసి అశోక్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. దీని ద్వారా వీరికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని అశోక్ చెబుతున్నాడు. రాణి వల్లే తమ జీవితాలు మెరుగయ్యాయని, తన దివంగత తల్లికి కూడా రాణి అంటే చాలా ఇష్టమని చెప్పాడు.
రాణికి కోపమొస్తే..
సాధారణంగా కోతులకు కోపమొస్తే మనుషులు లేదా ఇతర జంతువులపై విరుచుకుపడతాయి. హాని చేస్తాయి. కానీ ఈ కోతి మాత్రం పూర్తిగా భిన్నం. దానికి కోపమొచ్చినపుడు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా తన చేతిని కొరుక్కుంటుందట. ఇది గమనించి ఆ గ్రామస్థులు అది మనస్థాపానికి గురైందని, కోపంగా ఉందని అర్థం చేసుకుంటారట.
సోషల్ మీడియా స్టార్
రాణి కేవలం గ్రామంలోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రజాదరణ పొందింది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మనిషిని పోలిన ప్రవర్తన, దైనందిన జీవితంలో కలిసిపోయే సామర్థ్యం ఈ కోతిని స్టార్‌గా మార్చాయి.
Also Read : Viral News: రైలు కింద దాక్కుని వ్యక్తి 250 కిలోమీటర్లు ప్రయాణం, రైల్వే శాఖ కీలక వ్యాఖ్యలు