Viral News: చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షం, ఇదేంటని ప్రశ్నిస్తే ఫ్రై అయిందన్న రెస్టారెంట్ ఓనర్
Hyderabad News | ఎంతో ఇష్టపడి చికెన్ బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలోబల్లి వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

హైదరాబాద్: బిర్యానీ అంటే చాలు నగరవాసులతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే వారు ఎంతో ఇష్టంగా తింటారు. బిర్యానీ తింటుండగా బల్లి రావడంతో కస్టమర్ షాకయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్‌కు రెస్టారెంట్ ఓనర్ మరో షాకిచ్చాడు. మంచిగా ఫ్రై అయింది, తినమని యజమాని చెప్పడంతో కస్టమర్ నిజంగానే కంగుతిన్నారు.
గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి బిర్యానీ తినేందుకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తన ఆర్డర్ రావడంతో చికెన్ బిర్యానీ తింటుండగా ఆ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. బిర్యానీలో బల్లి రావడంతో కంగుతిన్న కస్టమర్.. ఇదేంటి అని రెస్టారెంట్ ఓనర్‌ను నిలదీశాడు.
జరిగిన తప్పిదానికి కస్టమర్‌కు క్షమాపణ చెప్పాల్సిన రెస్టారెంట్ యజమాని దారుణంగా ప్రవర్తించాడు. బల్లి మంచిగా ఫ్రై అయిందని, తినమని చెప్పడంతో బాధితుడు షాకయ్యాడు. కస్టమర్లతో వ్యవహరించిన తీరు సరికాదని, సరిగ్గా నడుచుకోవాలని కస్టమర్ ఓ రెస్టారెంట్ వారికి సూచించాడు. తనకు జరిగిన అవమానం, జరిగిన అన్యాయంపై బాధితుడు గుజ్జా కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. బిర్యానీలో బల్లి రావడం, ప్రశ్నించినందుకు రెస్టారెంట్ ఓనర్ తనతో ప్రవర్తించిన విధానంపై షేరిగూడ గ్రామం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రెస్టారెంట్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.






















