Super Police: బైక్ పై ఛేజ్ చేస్తూ ఉగ్రవాదులపై కాల్పులు - ఇజ్రాయెల్ పోలీస్ సాహసం
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు తీవ్ర తరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పోలీస్ రన్నింగ్ బైక్ పై ఉగ్రవాదులపై సాహసంతో కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టిస్తున్నారు. భీకర దాడులతో ఎన్నో వందల ప్రాణాలు బలిగొంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైనిక చర్యలను ముమ్మరం చేసింది. ఎక్కడికక్కడ తీవ్ర ప్రతి దాడులతో వారిని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా గాజాలోని హమాస్ స్థావరాలతో సహా, ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రతి ఇంటిని ఇజ్రాయెల్ దళాలు జల్లెడ పడుతున్నాయి.
సూపర్ పోలీస్
ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అక్కడి పోలీసులు చేపడుతున్న ఆపరేషన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు హమాస్ మిలిటెంట్లను వెంటాడి మట్టుబెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఛేజింగ్ సీన్ ను తలపించేలా ఉన్న ఈ వీడీయోను ఇజ్రాయెల్ పోలీస్ విభాగం ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది.
ఛేజింగ్ ఇలా..
ఇజ్రాయెల్ పోలీస్ బైక్ పై హమాస్ మిలిటెంట్లు ప్రయాణిస్తున్న కారును వెంబడించాడు. ఈ క్రమంలో మిలిటెంట్ల కారు సమీపంలోకి వెళ్లి బైక్ పై నుంచి ఒంటి చేత్తో తుపాకీతో కాల్పులు జరిపాడు. అలా, కారును ఆపేంత వరకూ కాల్పులు జరపడం వీడియోలో చూడొచ్చు. వెంటనే అతని వెనుకే వచ్చిన ఇజ్రాయెల్ పోలీసులు మరోసారి మిలిటెంట్లపై కాల్పుల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు పోలీస్ బాడీ కెమెరాలో రికార్డయ్యాయి.
Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT
— Israel Police (@israelpolice) October 9, 2023
నెటిజన్లు ఫిదా
ఇజ్రాయెల్ పోలీస్ రన్నింగ్ బైక్ పై మిలిటెంట్లతో పోరాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. 'సూపర్ కాప్', 'మీరు నిజంగా గ్రేట్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన దేశం కోసం ఆ పోలీస్ పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు.
ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకువెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని 'ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్' (IDF) హెచ్చరించింది. బందీలుగా ఉన్న వారిలో ఒక్క వృద్ధురాలికైనా, ఒక్క పసికందుకైనా వారు హాని చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ దళాల ప్రతినిధి రిచర్డ్ హెచ్చరించారు. అయితే, తాము ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబింగ్ చేయమని వెల్లడించారు. ఐడీఎఫ్ దాడికి ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లేదా వార్నింగ్ షాట్స్ పేల్చి హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపారు. సామాన్య ప్రజలు అక్కడి నుంచి వెళ్లేలా సూచిస్తామన్నారు. అయితే, ఇప్పటివరకూ 100 నుంచి 150 వరకూ కిడ్నాప్ అయి ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
3 లక్షల మంది సైన్యం
హమాస్ మిలిటెంట్లపై దాడికి ఇజ్రాయెల్ దాదాపు 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న వందల మంది ఇజ్రాయెల్ సైనికులు మాతృభూమికి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇజ్రాయెల్ 35 బెటాలియన్లను గాజా సరిహద్దులకు తరలించింది. భవిష్యత్తులో ఇక్కడ ఆపరేషన్ల కోసం అవసరమైన బేస్ లు, వసతులు నిర్మిస్తోంది. గాజాలో భారీగా పోరాడాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
200 మిలిటెంట్ల స్థావరాలపై దాడి
గాజాలో 200 మిలిటెంట్ల స్థావరాలపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. వీటిల్లో మిలిటెంట్ల ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఓ భవనాన్ని కూడా కూల్చేసినట్లు పేర్కొంది. దీంతో పలు సైనిక లక్ష్యాలను సైతం ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. గాజాలో మిలిటెంట్లకు అత్యవసర సేవలు అందకుండా ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. తాగునీటి, పారిశుద్ధ్య విభాగ కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు తెలిపింది. పాలస్తీనా వాసులు గాజా పట్టీ నుంచి వీలైనంత త్వరగా ఈజిప్టు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది.