Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో చిక్కుకున్న యూట్యూబర్ - సోషల్ మీడియాలో వీడియో రిలీజ్
Cyber Arrest Scam : సైబర్ అరెస్ట్ స్కామ్ కు గురైన ఓ ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ పరిస్థితి ఎవరికీ రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Cyber Arrest Scam : టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ ఇన్ స్టాగ్రామ్ సైతం సైబర్ స్కామ్ లో చిక్కుకున్నాడు. తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తనకెదురైన ఈ పరిస్థితులు ఇంకెవరికీ రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దాదాపు 40గంటల పాటు డిజిటల్ అరెస్ట్ కస్టడీలో ఉన్నానని చెప్పాడు.
సైబర్ స్కామ్ లో యూట్యూబర్ ఎలా చిక్కుకున్నాడంటే..
ప్రముఖ యూట్యూబర్ అంకుష్ బహుగుణ తాను సైబర్ అరెస్ట్ స్కామ్ లో ఎలా చిక్కుకున్నాడో ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ స్కామ్ వల్ల తాను మానసికంగా, ఆర్థికంగా చాలా నష్టపోయానన్నాడు. ఈ తరహా మోసాలపై అవగాహన కల్పించేందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నానని చెప్పాడు. ఇంతకీ ఈ స్కామ్ లో ఎలా చిక్కుకున్నాడన్న విషయంపై మాట్లాడిన అంకుష్.. నేను అప్పుడే జిమ్ నుంచి తిరిగొచ్చాను. అంతలోనే నాకు ఓ ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి.. మీ కొరియర్ డెలివరీ క్యాన్సిల్ అయిందని ఓ ఆటోమేటెడ్ మెసేజ్ ఇచ్చారు.
సపోర్ట్ కోసం జీరో నొక్కండి అని చెప్పగానే నేను ఇంకేం ఆలోచించకుండా సున్నా నొక్కాను. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే. అంతలోనే సపోర్ట్ ప్రతినిధి కాల్ తీసుకుని, ‘మీ ప్యాకేజీలో అక్రమ వస్తువులు పట్టుబడ్డాయి’ అని చెప్పాడు. మీ ప్యాకేజీని చైనాకు పంపారు. ఇప్పుడు దాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పడంతో నేను చాలా భయపడ్డాను. నేను ఎలాంటి ప్యాకేజీ పంపలేదని చెప్పాను. కానీ అందులో నా పేరు, ఆధార్ నంబర్ అన్నీ ఉన్నాయని, అది చాలా తీవ్రమైన నేరమని, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉంటారని చెప్పారు. మీ పేరుపై అరెస్ట్ వారెంట్ ఇప్పటికే ఉంది అని చెప్పారు" అని చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
"తీవ్ర భయాందోళనకు గురవడం గమనించి.. అవతలి వ్యక్తి వెంటనే ఒక గంటలోపు పోలీసులతో మాట్లాడమని చెప్పారు. కానీ నాకు అంత సమయం లేదని, నేరుగా పోలీస్ స్టేషన్‌కే కనెక్ట్ చేసి నాకు సహాయం చేస్తానని నన్ను ఒప్పించారు. అసలు ఆ కాల్ వాట్సాప్ కాల్ కి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో నాకు అర్థం కాలేదు. అది ఒక పోలీసు అధికారితో చేసిన వీడియో కాల్. ఆ వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉన్నాడు. ఆ వ్యక్తి తీవ్రమైన నేరాలతో పాటు మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో నా ప్రమేయం ఉందని చెప్పాడు. ఆ సమయంలోనే ఆ నకిలీ అధికారి తనకు తెలిసిన నేరస్థుల గురించి ఆరా తీశాడు.
నా బ్యాంక్ ఖాతాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు గుర్తించామని చెప్పాడు. అలా తాను బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సుమారు 40 గంటల పాటు వాళ్ల కస్టడీలోనే ఉన్నాను. స్కామర్‌లు నన్ను బ్యాంకుకు కూడా పంపారు. కానీ ఆ సమయంలో బ్రాంచ్ మూసివేయబడి ఉండడంతో వాళ్లు నన్ను చేపలు కొనమని చెప్పారు. ఆ టైంలో నా స్నేహితుల్లో ఒకరు ఇలాంటి మోసాల గురించి మెసేజ్ పంపడంతో నేను విషయం మొత్తం గ్రహించాను" అని అంకుష్ వీడియోలో వెల్లడించాడు.
ఈ తరహా మోసాలకు అందరూ ఒకేలా స్పందించరన్న అంకుష్.. దీన్ని మూర్ఖత్వంగా భావించకుండా, మీ చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పించండని ఈ సందర్భంగా సూచించాడు. వేరెవరూ ఇలాంటి మోసాలకు బలికాకుండా అప్రమత్తంగా, సమాచారంతో ఉండాలని చెప్పాడు.