Weight Loss: బరువు తగ్గండి, బహుమతి పట్టండి - ఆహా, ఆ దేశంలో ఇలా కూడా చేస్తారా?
స్థూలకాయం నుంచి బయటపడడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అవలంబిస్తున్నారు. అందుకే, అక్కడి ప్రభుత్వానికి ఓ ఐడియా వచ్చింది.
బరువు పెరిగితే ఎన్ని అనారోగ్యాలు వెంటపడతాయో మీకు తెలిసిందే. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం గురించి.. ముఖ్యంగా బరువు తగ్గడం గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు. మనలో చాలా మంది బరువు తగ్గడానికి నిపుణుల సలహాలను పాటిస్తుంటారు. ఉదయం లేవగానే వ్యాయామం చేయడం, రకరకాల పోషకాలతో కూడిన ఆహారం తినడం లాంటివి చేస్తుంటారు.
క్రమం తప్పకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి ఆహారంలో భాగంగా తీసుకోవడం, చీజ్, వెన్నె, జంక్ ఫుడ్ పదార్థాలకు దూరంగా ఉండడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే, ఇలా చేయడానికి ప్రజల వద్ద టైమ్ కూడా ఉండటం లేదు. అందుకే, యూకే ప్రభుత్వానికి ఒక కత్తిలాంటి ఐడియా వచ్చింది. ఎవరైతే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారో వారికి నగదు బహుమతిని అందిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఎక్కడా లేని విధంగా అక్కడే ఎందుకిలా? అనేగా మీ సందేహం. ఎందుకంటే ఆ దేశంలో ఇప్పుడు స్థూలకాయం చాలా పెద్ద సమస్యగా మారింది. ప్రజలకు డైటింగ్ పట్ల అవగాహన కలిపించడానికి, ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ప్రణాళికకు UK ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతు పలికారు. యూకే ఫిట్‌గా ఉండటానికి ఈ మొత్తం ప్రచారంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తానని తెలిపారు.
యూకే ప్రజల్లో స్థూలకాయం సమస్య చాలా పెరిగిపోతోంది. సర్వేలను గమనిస్తే ప్రస్తుతం అక్కడ ముగ్గురు చిన్నపిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతుంటే, అదే సమయంలో ముగ్గురు పెద్దలలో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి.
యూకే పత్రిక అయిన ది గార్టియన్ నివేదిక ప్రకారం అక్కడి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకుంటోంది. ప్రజల్లో బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటోంది. అందుకోసం ఎవరైతే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తారో వారికి నగదు రివార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రజల జీవనశైలిని పరిశీలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఒక యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా ప్రజలు ఎన్ని పండ్లు, కూరగాయలు తింటున్నారు? ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారు తదితర అంశాలను గమనిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో ఒక కుటుంబం వీటి కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఎంతమంది ప్రజలు జంక్ ఫుడ్ కి బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి, కొనడానికి ఇష్టపడతారో అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా అధిక బరువుగల వ్యక్తులను ఎన్నుకుని, వారికి బరువు తగ్గడంపై వివిధ రకాల కోర్సులకు కూడా వారే పంపిస్తారు. ఈ నిర్వహణ కోర్సులను వెయిట్ వాచర్స్, స్లిమ్మింగ్ వరల్డ్ వంటి సంస్థలు అందిస్తాయి.
యూకేలో రోజురోజుకు ఒక పెద్ద సమస్యగా తయారవుతున్న ఊబకాయాన్ని పరిష్కరించడమే అక్కడి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం. తమ ఆరోగ్యం విషయంపై అధిక శ్రద్ధ కనబరిచేవారికి దాదాపు నగదు రివార్డులతో పాటు ఈ పథకం కింద వ్యాయామం కోసం ఉచిత టిక్కెట్లు, డిస్కౌంట్‌గా మార్చుకోగల ఆరోగ్య యాప్‌లో పాయింట్లు అందుబాటులో ఉంటాయి. ఇతర బహుమతులు కూడా అందిస్తారు.