Milk Adulteration : మీ గ్లాసు పాలల్లో విషం ఉందా? కల్తీని గుర్తించే సులభమైన మార్గాలు ఇవే!
Milk Adulteration : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయారు.

Milk Adulteration : పాలు ప్రతి ఇంట్లో నిత్యావసరమైన ఆహారం. చిన్న పిల్లల పెరుగుదల నుంచి వృద్ధుల ఆరోగ్య సంరక్షణ వరకు ప్రోటీన్, కాల్షియం అందించే అత్యంత ప్రధాన వనరుగా పాలను భావిస్తారు. అయితే మనం ఎంత నమ్మకంతో తాగే ఈ పాలు అమృతమా లేగా విషమా? రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన ఘటనతో ఇప్పుడు అందరిలో భయం మొదలైంది. కల్తీ పాలు దాగిన నలుగురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దెబ్బకు పాలు పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు. మార్కెట్‌లో విచ్చలవిడిగా సాగుతున్న కల్తీ దందా కారణంగా పాలు కేవలం తెల్లని రంగులో ఉన్న విష పదార్థాలుగా మారిపోతున్నాయి. స్టార్చ్, డిటర్జెంట్, ప్రాణాంతకమైన యూరియా వంటి పదార్థాలను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
రాజమండ్రిలో విషాదం - నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. కల్తీ పాలు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కల్తీ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోనే వెలుగు చూసినప్పటికీ ఈ బెడద దేశవ్యాప్తంగా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కల్తీ పాలు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది.
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కల్తీ పాలు విక్రయం?
FSSAI నివేదికల ప్రకారం భారత్‌లో విక్రయించే పాలలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ విషయంలో 12వేల కేసులు నమోదు చేశాయి అంటే దుస్థితి అర్థమవుతుంది.
కల్తీ పాలలో ఏం కలుపుతారు?
పాల పరిమాణాన్ని పెంచడానికి లేదా అవి చిక్కగా కనిపించటానికి లాభాపేక్షతో వ్యాపారులు రకరకాలైన ప్రమాదకర రసాయనాలు కలుపుతారు. పాలు ఎక్కువగా కనిపించడానికి చాలా మంది మొదట నీళ్లు కలుపుతారు. అయితే దీంతో పాలు పలుచనైనట్టి కనిపిస్తాయి. అందుకే చిక్కగా కనిపించేందుకు స్టార్చ్ కలుపుతారు. పాలు ఎక్కువ సమయం నిల్వ కోసం డిటర్జెంట్ కలుపుతారు. ఇలా కలిపితే పరీక్షల్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నట్టు చూపుతుంది. అందుకే అందులో యూరియా కలిపితే లెక్కలు మారిపోతాయి. వీటితోపాటు పాలు ఎక్కువ కాలం విరిగిపోకుండా ఉండేందుకు ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కలుపుతారు.
పాల స్వచ్ఛను ఎలా తెలుసుకోవాలి?
మీ ఇంటికి వచ్చే పాలు స్వచ్చమైన కాదో తెలుసుకోవడానికి లాబొరేటరీకి వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరీక్షలతోనే కల్తీ పాలన గుట్టు తెలుసుకోవచ్చు. నీటి కల్తీని గుర్తించేందుకు స్లోపింగ్ సర్ఫేస్ టెస్టు చేయాలి. అంటే పాలు మరగబెట్టిన తర్వాత గాజు పాలను కానీ, లేదా స్టీల్ ప్లేట్‌ను కొద్దిగా వాల్చి, దానిపై చుక్క పాలు వేయండి. ఆ పాలు వేగంగా జారిపోయి ఎలాంటి మార్క్‌లు పడకపోతే అందులో నీళ్లు కలిసినట్టు అర్థం చేసుకోవాలి.
స్టార్చ్ కలిసిందా లేదా అని తెలుసుకునేందుకు అయోడిన్ టెస్టు చేయాలి. ఒక స్పూన్ పాలలో 2-3 చుక్కల అయోడిన్ కలపండి. అప్పుడు పాల రంగు నీలం లేదా ముదురు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉన్నట్టు అర్థం. రుంగు మారకపోతే అది స్వచ్ఛమైనది అని తెలుసుకోవాలి. డిటర్జెంజట్ కల్తీని షేక్ చేసి గుర్తించవచ్చు. 5-10 మిల్లీ లీటర్ల పాలు తీసుకొని ఒక బాటిల్‌లో వేసి బాగా షేక్ చేయండి. థిక్ నురగ వస్తే అందులో డిటర్జెంట్ కలిసినట్టు లెక్క. సహజమైన పాలలో నురుగు చాలా తక్కువగా కనిపిస్తుంది.
పాలలో యూరియా కలిసిందో లేదో లిట్మస్ పేపర్ పరీక్ష ద్వారా ప్రూవ్ చేయవచ్చు. ఒక టెస్ట్ ట్యూబ్‌లో పాలు తీసుకొని కొద్దిగా సోయాబీన్ పౌడర్ కలపండి. ఐదు నిమిషాల తర్వాత ఎర్రటి లిట్మస్ పేపర్ అందులో ముంచండి. ఆ పేపర్ కలర్ నీలం రంగులోకి మారితే ఆ పాలలో యూరియా కలిసినట్టు అర్థం చేసుకోవాలి. యూరియా పాలు రుచికి కొంచెం చేదుగా ఉంటాయి. పాలలో సల్ఫ్యూరిక్ యాసి్ కలిస్తే వైలెట్ రంగు రింగ్ ఏర్పడతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిస్తే నీలం రంగుగా మారతాయి.























