Biker Assaults Bus Driver: బస్సులోకి దూసుకొచ్చి డ్రైవర్‌ను కొట్టిన బైకర్, చివరికి ఊసలు లెక్కించాడు
Biker Assaults Bus Driver: కర్ణాటకలో ఓ బైకర్ బస్సు డ్రైవర్ ను కొట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అతడిని అరెస్టు చేశారు.
Biker Assaults Bus Driver: కొందరు కొన్నిసార్లు విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. విపరీతమైన ఆవేశంలో ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఏం చేస్తున్నాం.. దాని పర్యావసానాలు ఏంటి అనేది కూడా ఆలోచించరు కొందరు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటారు. సారీ చెప్పుకుంటే అయిపోయేదాన్ని ఆవేశంలో తీవ్రంగా ప్రవర్తించడం వల్ల చివరికి ఇబ్బంది పడతారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ వీడియో. అందులో ఏముందంటే..
ఓ వ్యక్తి కర్ణాటక ఆర్టీసీ బస్సులోకి బలవంతంగా ఎక్కాడు. డ్రైవర్ డోర్ వైపు నుంచి బస్సులోకి ఎక్కి అక్కడ ఉన్న డ్రైవర్ పై దాడికి యత్నించాడు. తర్వాత కిందకు దిగి ఆ డ్రైవర్ ను చొక్కాపట్టుకుని కిందకు లాగాడు. బస్సు ముందు రోడ్డుపై కిందా మీదా పడుకుంటూ ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటకలోని మైసూర్ లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న ఒక వ్యక్తి బైక్ పై జీఎన్ రోడ్డులో వెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు తన బైక్ కు తగిలిందని ఓ బైకర్ ఆ బస్సు డ్రైవర్ పై ఆగ్రహించాడు. దీనిపై బస్సు డ్రైవర్ తో ఘర్షణ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో.. ఆగ్రహించిన ఆ బైకర్.. బస్సులోకి దూసుకొచ్చాడు. అనంతరం డ్రైవర్ ను చొక్కా పట్టుకుని కిందకు లాగాడు. డ్రైవర్ తో పాటు బస్సు కండక్టర్ ను కూడా కొట్టాడు. రోడ్డుపై కిందా మీదా పడుకుంటూ కొట్టుకున్నారు. ఇంతలో రోడ్డుపై ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. వారిని ఆపి దూరం చేశారు.
Also Read: IRCTC Scam: రైలు టికెట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించి రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు
ఈ సంఘటన అంతటిని అదే బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. కొట్టుకున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మైసూరు పోలీసు కమిషనర్ స్పందించారు. పబ్లిక్ సర్వెంట్లపై దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఆ బైకర్ పై కేసు నమోదు చేసినట్లు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. మైసూరుకు చెందిన 30 ఏళ్ల షారూక్ ను అరెస్టు చేశారు.
— Commissioner of Police Mysuru (@CPMysuru) August 12, 2023
'బుర్ఖా వేసుకుంటేనే బస్సు ఎక్కండి'
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలికలపై ఓవరాక్షన్ చేశాడు. కమలాపూర్ తాలూకాలోని ఓకలి గ్రామం నుంచి బసవకల్యాణ్ కు వెళ్తున్న బస్సులో ఎక్కేందుకు కొంత మంది విద్యార్థినులు ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్ వారిని అడ్డుకున్నాడు. బస్సు ఎక్కే ముందు ముస్లిం బాలికలు అందరూ బురఖాలు ధరించాలని డిమాండ్ చేశాడు. ముస్లిం విద్యార్థులకు బురఖాలు మాత్రమే ఆమోదయోగ్యమని పేర్కొన్నాడు. అలాగే అందులో కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించగా.. వారిని కూడా బస్సు ఎక్కేందుకు ఆ డ్రైవర్ నిరాకరించాడు. మీరు ముస్లిం అయితే బురఖా మాత్రమే ధరించండి, హిజాబ్ కాదు, అప్పుడే మిమ్మల్ని బస్సు ఎక్కనిస్తా అంటూ ఆ డ్రైవర్ బాలికలపై దుర్భాషలాడాడు. తమ మతం గురించి ఆ బస్ డ్రైవర్ ప్రశ్నించాడని, బురఖా ధరించాలని పట్టుబట్టాడని ఓ బాలిక చెప్పుకొచ్చింది. బురఖా వేసుకునేందుకు అంగీకరించకపోవడంతో వారిని ఆ బస్సు డ్రైవర్ దూషించాడని, బస్సు ఎక్కకుండా తరిమికొట్టాడని మరో బాలిక పేర్కొంది. ఆ బస్సు డ్రైవర్ తీరును ఇతర ప్రయాణికులు నిలదీశారు. తన బస్సు సరైన కండిషన్ లో లేదంటూ ఏదేదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ బాలికలే కావాలని న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించాడు.