Viral News : సోషల్ మీడియా పిచ్చితో బిడ్డకు విషమిచ్చిన తల్లి- ఫాలోవర్లు, ఫేమ్, నిధుల కోసం వెర్రివేషాలు
Australian Influencer : ఓ మహిళ సోషల్ మీడియాలో పేరు కోసం తన సొంత బిడ్డనే వాడుకుంది. చిత్రహింసలకు గురి చేసి, దాని వల్ల పడే వేదనను పోస్ట్ చేసింది.

Australian Influencer : సోషల్ మీడియాలో పేరు, ఫాలోవర్లు పెంచుకోవాలనే ఆశతో కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కన్న కూతురని కూడా చూడకుండా చిత్ర హింసలకు గురి చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం డబ్బులు పంపాలని కోరింది. ఏకంగా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టి ఎదగాలనుకుంది. మహిళపై అత్యంత అసహ్యాన్ని కలిగించే ఈ ఘటన రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం తన కుమార్తెకు విషయం ఇచ్చారన్న ఆరోపణలతో ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమెపై చిత్రహింసలు, మోసం, హాని కలిగించే ఉద్దేశ్యంతో విషాన్ని అందించడం, పిల్లల దోపిడీకి సంబంధించిన వస్తువులను తయారు చేయడం వంటి పలు నేరాలున్నాయి. ఈ భయానక కథనం ఆర్థిక లాభం, పేరు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని రుజువు చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
గతేడాది ఆగస్టు - అక్టోబర్ మధ్య, క్వీన్స్‌లాండ్ పోలీసులు ఎటువంటి వైద్య అనుమతి లేకుండా, ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఏడాది వయస్సు గల బిడ్డకు అనధికారిక మందులను అందించారని ఆరోపించారు. తన బిడ్డ అపారమైన నొప్పి, బాధలో ఉన్నప్పుడు చిత్రీకరించారని, ఫోలోవర్లను ఆకట్టుకోవడానికి, విరాళాలను ప్రోత్సహించడానికి ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారని ఆ మహిళపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన క్వీన్స్‌లాండ్ పోలీసు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పాల్ డాల్టన్.. "ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి, ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ఈ డ్రగ్స్‌ను అందించాడని మేము నమ్ముతున్నాం" అని చెప్పారు. గో ఫండ్ మీ క్యాంపెయిన్ (GoFundMe) ద్వారా సుమారుగా 60వేల డాలర్లను సేకరించి, ప్రజలను మోసగించినందుకు ఆ మహిళ తన బిడ్డను కష్టాల్లో నెట్టి వీడియోలు చేసి, వినియోగించుకుందని నొక్కి చెప్పారు. తన కుమార్తెకు అనారోగ్యం అనే పేరు చెప్పుకుని.. ఆ ముసుగులో నిధులు సేకరించిందని తెలిపారు.
ఎలా బయట పడిందంటే..
తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీతో అక్టోబర్‌లో చిన్నారి అడ్మిట్ అయిన తర్వాత బ్రిస్బేన్‌లోని సౌత్‌లోని ఆసుపత్రి వైద్యులు హెచ్చరిడంతో విచారణ ప్రారంభమైంది. శిశువు ప్రారంభ పరిస్థితి వాస్తవమైనదిగా కనిపించినప్పటికీ, ఆమె అనుభవించిన బాధలు.. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన చెందారు. ఈ అనుమానాలతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమ్మతి లేకుండా ప్రిస్క్రిప్షన్, ఓవర్-ది-కౌంటర్ మందులను పొందడం సహా, తన చర్యలను దాచడానికి మహిళ జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆమె ఇంట్లో మరొక వ్యక్తి నుండి ఈ మందులను ఉపయోగించినట్లు సమాచారం.
తప్పుడు దారిలో నిధుల సేకరణ
ఆ మహిళ GoFundMe ద్వారా తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతోందంటూ దాదాపు 60వేల డాలర్లు సేకరించింది. అయితే ప్రస్తుతం GoFundMeతో చర్చించి ఆ డబ్బును విరాళం ఇచ్చిన వ్యక్తులకు తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఆమె సురక్షితంగా, క్షేమంగా ఉందని, ఆమె భవిష్యత్తు శ్రేయస్సును నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు భరోసా ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

