All Eyes On Reasi: అందరి కళ్లూ రియాసీపైనే... సోషల్ మీడియాలో ట్రెండింగ్
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న All Eyes On Reasi విషయం ఆసక్తిగా మారింది. జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు.
Reasi Attack: ``అందరి కళ్లూ రియాసీపైనే`` ట్యాగ్‌తో సోషల్ మీడియా(Social media)లో ట్రెండింగ్ జోరుగా పెరిగిం ది. జమ్ము కశ్మీర్(Jammu kashmir)లోని ప్రఖ్యాత వైష్ణో దేవి(Vyshno devi Temple) ఆలయానికి వెళ్తున్న భక్తులపై రియాసీ(Reasi) జిల్లాలో ఉగ్రదాడి జరిగిన విషయంలో ఈ దారుణ ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండించా రు. అదేవిధంగా ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు సైతం తీవ్ర ఆవేదన , ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలోనే All Eyes On Reasi పేరుతో తమ తమ సంతాపాలను , ఆగ్రహాలను కూడా ప్రముఖులు పంచుకుంటున్నారు.
అసలు ఏం జరిగింది?
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆ బస్సు లోయలో పడి పోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి విషాదాన్ని నింపింది. దాడికి సంబంధించిన వివరాలు వెలువడగానే, బాలీవుడ్ తారలతో సహా వివిధ ప్రజాప్రతినిధులు తమ సంతాపాన్ని తెలియజేశారు. అంతేకాదు.. హింసను సహించేది లేదని.. పేర్కొన్నారు. కొందరు ప్రత్యక్షంగా మీడియా ముందు మాట్లాడితే మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ నటి, మండ్య నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఎంపీ కంగనా రనౌత్, ప్రముఖ నటి రష్మిక మందన్న, వరుణ్ ధావన్, ఉర్ఫీ జావేద్ , సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
రియాసిపై అందరి దృష్టి
ఇటీవల, దక్షిణ గాజాలోని రఫాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ దారుణ ఘటనలో వందల మంది చిన్నారులు సహా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి తరువాత, "ఆల్ ఐస్ ఆన్ రఫా" సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిని ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేకాదు, తక్షణమే దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, మన దేశంలో ఇప్పుడు "ఆల్ ఐస్ ఆన్ రియాసి" అనే ట్రెండ్ కొనసాగుతోంది. రియాసి జిల్లాలో ఉగ్రమూకలు చేసిన దాడిలో 9 మంది మరణించడం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో రియాసి ఘటనను ఖండించారు. దీంతో ఇది ట్రెండ్‌గా మారింది. తర్వాత అనేక మంది రియాసి బాధితులకు, వారి కుటుంబాలకు తమ విచారం వ్యక్తం చేస్తూనే వారికి మద్దతును ప్రకటించారు.
కంగనా స్పందన..
నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్పందనను పంచుకున్నారు. జమ్మూ & కాశ్మీర్‌లోని రియాసిలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఉగ్రవాద దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ``వారు వైష్ణోదేవి దర్శనం కోసం వెళుతున్నారు. హిందువులన్న కారణంగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇది దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. మరణించిన వారి కోసం ప్రార్థిస్తున్నా. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా`` అని కంగన పేర్కొన్నారు.
నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు `` ఉగ్రదాడి విషయం తెలిసి నా హృదయం శోక సంద్రమైంది. ఈ దాడిలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులందరికీ, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
నటుడు వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "రియాసిలో అమాయక యాత్రికులపై జరిగిన భయానక దాడితో కలత చెందాను. పిరికి ఉగ్రవాద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరణించిన ఆత్మలకు ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు. ఇదేసమయంలో ఉర్ఫీ జావేద్ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నించారు. "మతం పేరుతో చంపడం - ఇది మీకు ఏ దేవుడు చెప్పాడు?" అని ఆయన ఉగ్రమూకలను ప్రశ్నించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. "రియాసి. జమ్మూలో యాత్రికులపై జరిగిన దాడి పిరికిపందల చర్య. ఈ దాడి విషయం తెలిసిన తర్వాత రగిలిపోయాను. చాలా దారుణం. అత్యంత బాధగా ఉంది. బాధితుల కుటుంబాలకు ఈ కష్ట సమయంలో కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా`` అని పేర్కొన్నారు.
దాడిని ముక్త కంఠంతో ఖండించిన..
ఉగ్రదాడిపై అన్ని వర్గాల ప్రజలు స్పందించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై జరిగిన దాడిని అందరూ ఖండించారు. ఇలాంటి దురాగతాలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం దుఃఖిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో బాధితులుగా మారిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.