House In Mall: మాల్ మధ్యలో ఇల్లు - కోట్లు ఇస్తామన్నా కదలని బామ్మ, ఆ ఒక్క మాటతో ఏడిపించేసింది!
ఆమెకు కోట్లు ఆశ చూపారు. కానీ, ఆమె అన్న ఒకే మాటతో ఆ బిల్డర్.. ఆ ఇంటిని వదిలేసి చుట్టూ మాల్ కట్టాడు. ఇంతకీ ఆమె ఏం అడిగింది?
పైసా పైసా కూడబెట్టి.. ఇటుక ఇటుక పేర్చుకుని కట్టుకున్న కలల సౌధం అది. ఆ ఇంట్లోనే పిల్లలను కని, లాలించి, పెద్దవాళ్లను చేసి.. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న ఇల్లు అది. బయటవాళ్లకు అది నీడనిచ్చే గూడు. కానీ, ఆమెకు మాత్రం అది తన గుండె. మరి అలాంటి గుండెను తమకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తుందా? ఇవ్వనే ఇవ్వనని మొండికేసింది. కోట్లాది డబ్బును ఆశ చూపినా.. ఏ మాత్రం తగ్గలేదు. ‘‘నువ్వు డబ్బులిచ్చి నా జ్ఞాపకాలను చరిపేయలేవు. కనీసం మరణం వరకైనా సరే, నన్ను ఈ ఇంట్లోనే ఉండనివ్వు’’ అనే చిన్న మాటతో ఆ కరుడుగట్టిన బిల్డర్ మనుసు మార్చేసింది. ఇక చేసేది ఏమీలేక.. వారు ఆ ఇంటిని వదిలేసే మాల్ నిర్మించారు. ఆ మాల్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ బామ్మకు మద్దతు తెలుపుతూ ఆ ఇంటి ముందు ఒక బెలూన్ పెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే, ఆ బెలున్లు పెట్టడం వెనుక కూడా ఓ అర్థం ఉంది.
2006లో మొదలు..: ఆమె పేరు ఎడిత్ మేస్‌ఫీల్డ్. వయస్సు 84 ఏళ్లు. వాషింగ్టన్‌లోని సీటెల్‌లో నివసిస్తున్న ఈమె ఇప్పుడు లోకల్ హీరో. ఎంతమందికి ఆదర్శ వనిత. తాను ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటిని కొనుగోలు చేసి, దాన్ని కూలగొట్టి మాల్ కట్టాలని ప్రాపర్టీ డెవలపర్లు ప్లాన్ చేశారు. అయితే, బామ్మ మాత్రం వారికి చుక్కలు చూపించింది. ఈ ప్రయత్నాలు ఇప్పటివి కావు.. 2006 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆమెను ఒప్పించేందుకు ప్రాపర్టీ డీలర్లు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. మిలియన్ల కొద్ది డాలర్లను ఆమెకు ఆశ చూపారు. చివరికి, ఆ బామ్మ పంతమే నెగ్గింది. వేరే దారి లేకపోవడంతో బిల్డర్లు ఆ ఇంటిని వదిలేసి, దాని చుట్టూ షాపింగ్ మాల్ కట్టుకున్నారు.
ఎన్ని కోట్లు ఆశ చూపినా..: ఆ ఇల్లు కట్టి సుమారు 108 ఏళ్లు కావస్తుంది. సాధారణంగా దానికి అంత ధర కూడా పలకదు. కానీ, ప్రాపర్టీ డీలర్లు అక్కడ ఉన్న విలువ కంటే రెట్టింపు నగదు ఇస్తామని ఆమెకు తెలిపారు. ఒక మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.7.58 కోట్లు) వరకు ఇస్తామన్నారు. కానీ, ఆమె అందుకు గట్టిగా ‘నో’ చెప్పింది. చివరికి, ఆ పెద్దావిడని బలవంతం చేస్తే తామే విలన్స్ అవుతామని గ్రహించి వెనక్కి తగ్గారు. కనీసం ఆ ఇంటి చుట్టూ మాల్ కట్టుకోడానికైనా అనుమతి ఇవ్వండని బతిమాలారు. దీంతో ఆమె అయిష్టంగానే ‘సరే’ అంది.
ఆ ఒక్క మాటతో..: చిత్రం ఏమిటంటే.. ఎవరైతే ఆ మాల్‌కు కన్‌స్ట్రక్షన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న బ్యారీ మార్టిన్ ఆమెకు స్నేహితుడే. ‘‘ఆ మాల్ కట్టేందుకు నీ ఇల్లు కూల్చేయక తప్పదు’’ అని బామ్మకు మొదట చెప్పింది కూడా అతడే. అయితే, ఆ మాట అన్నందుకు, తనతో బేరాలు ఆడుతున్నందుకు ఆమె ఏ రోజు మార్టిన్‌ను ప్రత్యర్థిగా చూడలేదు. ఆయన్ని ఒకే ఒక మాట అడిగింది.. ‘‘కనీసం నేను బతికి ఉన్నంతవరకైనా ఈ ఇంట్లో ఉండనివ్వు. ఇందుకు నాకు హెల్ప్ చెయ్యి’’ అని దీనంగా అడిగింది. ఆ ఒక్క మాట విని మార్టిన్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. చివరికి, ఇంటిని వదిలే మాల్‌ను కట్టేలా ప్లాన్ చేయించాడు. ఆ మాల్ నిర్మాణాల వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని తన కన్‌స్ట్రక్షన్ సిబ్బందికి సూచించాడు. కానీ, బ్యాడ్ లక్.. ఆ ఇంటి బాధ్యతలను మార్టిన్‌కే అప్పగించి.. 2008లో ఆమె చనిపోయింది. అయితే, మార్టిన్ ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో ఆ ఇంటిని విక్రయించక తప్పలేదు.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు
రూ.2.35 కోట్లకు అమ్మేశాడు: మార్టిన్ ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘చాలామంది ఆమె ఆ మాల్ నిర్మాణాన్ని వ్యతిరేకించిందని అనుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదు. ఆమెకు ఆ ఇంటిని విడిచి వెళ్లడం ఇష్టం లేదు అంతే. కేవలం చనిపోయే వరకైనా ఆ ఇంట్లో ఉండనివ్వు అని మాత్రమే ఆమె నన్ను అడిగింది. ఆమె మరణం తర్వాత ఆ ఇంటిని నేను రూ.2.35 కోట్లకు విక్రయించాను’’ అని మార్టిన్ తెలిపాడు. ప్రస్తుతం ఆ ఇల్లు అలాగే ఉంది. చాలామంది ఆ బామ్మను స్మరిస్తూ ఆ ఇంటి ప్రహారికి బెలూన్లు కడుతున్నారు.
బెలూన్లు ఎందుకు కడుతున్నారు?: 2009లో డిస్నీ సంస్థ నిర్మించిన ‘అప్’ (UP) అనే యానిమేటేడ్ మూవీకి ఈ బామ్మే స్ఫూర్తి అనే ప్రచారం జరిగింది. ఇందులో బామ్మకు బదులుగా వృద్ధుడి పాత్రను చూపించారు. ఆ కథలో కూడా ఆ ప్రాంతం బాగా డెవలప్ అయినా.. అతడు తన ఇంటిని విక్రయించడానికి ఇష్టపడడు. దీంతో అతడు తన ఇంటికి హీలియం బెలూన్లు కట్టి గాల్లో ఎగిరేలా చేస్తాడు. అయితే, ఈ చిత్రాన్ని 2004లోనే మొదలుపెట్టామని, అప్పటికి ఈ బామ్మ గురించి చిత్ర యూనిట్‌కు తెలియదని తెలిసింది. కానీ, ప్రజలు మాత్రం ఆ సినిమాలో చూపించిన ఇల్లు ఆ బామ్మదేనని నమ్ముతున్నారు. ‘అప్’ సినిమాలో చూపించినట్లే చాలామంది ఆ ఇంటికి బెలూన్లు కడుతున్నారు.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!