Telangana Elections 2023: ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్టీపీ దూరం - కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతు ఉంటుందన్న షర్మిల
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతిస్తామని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడడం సరికాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మా మద్దతు ఉంటుంది. మేం పోటీ చేయడం లేదు.' అంటూ షర్మిల స్పష్టం చేశారు.
పాలేరులో నిలబడాలనుకున్నా.. పొంగులేటిని ఓడించలేను : షర్మిల #YSSharmila #YSRTP #Paleru #PonguletiSrinivas pic.twitter.com/jhMPa2uUr5
— ABP Desam (@ABPDesam) November 3, 2023
తప్పనిసరి పరిస్థితుల్లోనే
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ స్థాపించామని, సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాకూడదని అన్నారు. తాము పోటీ చేయకపోవడం చాలా బాధాకరమైన నిర్ణయమని అయినా తప్పలేదని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగమని, ఈ విషయంలో తాను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించాలని కోరారు. రాజకీయాలు అంటే చిత్తశుద్ధి, ఓపిక ఉండాలని లేకుంటే రాణించలేమని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.
పది రోజుల క్రితం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని, కానీ మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని షర్మిల చెప్పారు. మనకు యుద్ధం చేసే సమయం వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చీలిస్తే ప్రజలు తనను క్షమించరని అన్నారు. గెలుపు ముఖ్యమేనని, అయితే త్యాగం అంతకంటే గొప్పదని చెప్పారు.
'నన్ను క్షమించండి'
'2013లో పాదయాత్ర చేసినప్పటి నుంచి పొంగులేటి తనతో కలిసి నడిచారు. ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కోసం మేం ప్రచారం చేశాం. ఇప్పడు ఆయన పాలేరులో పోటీ చేస్తున్నారు. నేనేం చేయాలో చెప్పండి. ఈ నిర్ణయం బాధిస్తే క్షమించండి.' అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పటికైనా పాలేరులో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ తో వైఎస్ అనుబంధం'
కాంగ్రెస్ అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధమని షర్మిల అన్నారు. ఆయన బతికుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికే ప్రధాని అయ్యేవారని అభిప్రాయపడ్డారు. 'వైఎస్ 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ కుటుంబమంటే చాలా అభిమానం. రాహుల్ ను ప్రధానిని చెయ్యాలని మొట్ట మొదట వైఎస్సారే అన్నారు. సోనియా, రాహుల్ లు వైఎస్ పై వారికున్న అభిమానాన్ని నాపై చూపుతున్నారు.' అంటూ షర్మిల పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల తెలిపారు. ఇటీవల రాహుల్, సోనియాలు తనను ఢిల్లీకి ఆహ్వానించారని వారితో రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చాయని, ఇటు తెలంగాణలోనూ విజయం సాధించే అవకాశం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు.