(Source: ECI/ABP News/ABP Majha)
Yadadri Parking Fees Issue : యాదాద్రిలో కొండెక్కిన పార్కింగ్ ఫీజు, మండిపడుతున్న భక్తులు
Yadadri Parking Fees Issue : యాదాద్రిలో పార్కింగ్ ఫీజు వ్యవహారం విమర్శలకు దారితీస్తుంది. కొండపైకి వాహనాల పార్కింగ్ కు రూ.500, తర్వాత ప్రతీ గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని ఈవో నిర్ణయించారు.
Yadadri Parking Fees Issue : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో పార్కింగ్ ఫీజు కొండెక్కింది. భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించేందుకు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సరికొత్త నిర్ణయాన్ని శనివారం తీసుకొంది. భక్తులు తమ వాహనాల(కార్లు, నాలుగు చక్కాల వాహనాలు) ద్వారా కొండపైకి చేరే అవకాశం కల్పిస్తూ పార్కింగ్ ఫీజు రూ.500 చెల్లించాలంటూ ఆలయ ఈవో గీత ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు తమ వాహనంతో (ఫోర్ వీలర్లు) ద్వారా కొండపైకి చేరుకోవాలంటే రూ.500 రుసుము చెల్లించాల్సిందే. రుసుం చెల్లించిన వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. కొండపై కేటాయించిన స్థలంలో ఒక గంట మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. గంట దాటితే ప్రతి గంటకూ రూ.100 చెల్లించాల్సిందేనని ఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దాతలకు గుర్తింపు కార్డులు
ఆలయ ఈవో ప్రకటనతో వీవీఐపీ వాహనాలు మినహా మరే ఇతర వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. అయినా రోజూ 60 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నాయని గ్రహించి ఈనెల 26న ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు. కొండ కింది నుంచి ఘాట్ రోడ్డు ప్రవేశమార్గంలోనే వాహనాదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కొండపైన క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్ వద్ద, వీఐపీ గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.ఈ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆలయానికి భారీ విరాళాలు సమర్పించిన దాతలు తమ గుర్తింపు కార్డులు చూపిస్తే వారి వాహనాలను కొండపైకి ప్రవేశ రుసుం లేకుండా అనుమతించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఈవో తెలిపారు.
పార్కింగ్ ఫీజు నిర్ణయంపై విమర్శలు
దేవస్థానం అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు వసతి సౌకర్యం, కనీస సౌకర్యాలైన మంచినీరు, బాత్ రూమ్ లు ఏర్పాటు చేయని అధికారులు ధనవంతులకు మాత్రం డబ్బులు చెల్లిస్తే కొండపైకి తన సొంత కారులో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార కేంద్రంగా యాదాద్రి మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. సామాన్య భక్తులకు యాదాద్రి దర్శనాన్ని దూరం చేస్తున్న ఆలయ ఈవో చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఈవో పై చర్యలు తీసుకోవాలని సీపీఐ పార్టీ నాయకులు కోరుతున్నారు. భక్తుల సైతం పార్కింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు.