Telangana News : టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఈడీ దూకుడు - కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ?
టీఎస్‌పీఎస్సీ బోర్డు ముఖ్యులకూ ఈడీ నోటీసులు ఇస్తుందా?
Telangana News : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పెద్దగా సహకరరించడం లేదు. వివరాలు ఇవ్వడం లేదని ఈడీ కోర్టులో కూడా పిటిషన్ వేసింది. అయితే అందుబాటులో ఉన్న వివరాలతో నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. భారీగా నగదు లావాదేవీలు జరగడంతో లోతైన కుట్ర ఉందన్న అనుమానంతో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి, కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో సహా మరి కొంత మంది కమిషన్ సభ్యులను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వీరిని ప్రశ్నించారు. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈడీ అధికారులు నేడు చంచల్‌గూడ జైల్లోనే ఇద్దరు నిందితుల నుంచి ఈడీ అధికారులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఆలాగే ఆఫీసుకు పిలిపించి టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని కూడా ప్రశ్నించారు.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటి వరకూ 17మందిని అరెస్ట్ చేశారు. 40 లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. సిట్ అధికారుల ఎఫ్‌ఐఆర్‌తో పాటు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. గత నెల 23న ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా కేవలం 40 లక్షల రూపాయలు చేతులు మారాయా లేక ఇంకా పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగి ఉండే అవకాశాలు లేకపోలేదని ఈడీ అనుమానిస్తోంది. జరిగిన నగదు లావాదేవీలు బ్యాంకుల ద్వారానా లేక హవాలా ఇతర మార్గాల గుండా జరిగిందా అనే అంశంపై నిగ్గు తేల్చాలని ఈడీ భావిస్తోంది.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను దొంగలించి నిందితులు పేపర్ లీకేజీకి పాల్పడినట్లు మొదటినుంచి సిట్ చెబుతూ వస్తోంది. అయితే ఈడీ విచారణ పూర్తిగా మనీలాండరింగ్ కోణంలోనే జరుగుతుంది. పేపర్ ఎలా లీకైంది... ఎవరు నిందితులు వంటి విషయాలతో ఈడీకి సంబంధంలేదు. అయితే మనీలాండరింగ్ విచారణలో సిట్ అధికారులు తేల్చనిది ఏదైనా బయట పడితే మాత్రం సంచలనం అయ్యే అవకాశం ఉంది.