(Source: ECI/ABP News/ABP Majha)
Gruha Jyothi: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు, వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
Zero BILL: గృహజ్యోతి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరణ, జీరో బిల్లుకు విద్యుత్ శాఖకు రియంబర్స్ చేయనున్న ప్రభుత్వం
Free Power: కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం పకడ్బందీగా అమలు చేస్తున్న రేవంత్(Revanth Reddy) సర్కార్...మరో రెండు హామీలు అమలకు పచ్చజెండా ఊపారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందజేసే కార్యక్రమానికి ఇటీవల నిర్వహించిన మంత్రివర్గం ఆమోదం లభించడంతో క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారు. విద్యుత్ రీడింగ్ తీసే సిబ్బంది ఇళ్లవద్దకు వచ్చి పథకానికి అర్హులైన వారి నుంచి ఆధార్(Adhar), రేషన్ కార్డు(Ration Card), మీటర్ రీడింగ్ నెంబర్లు సేకరిస్తున్నారు.
గృహజ్యోతి పథకానికి అర్హతలు
గృహజ్యోతి (Gruha Jyothi) పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో విద్యుత్ శాఖ సిబ్బంది వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నెలకు 200 యూనిట్ల విద్యుత్ వాడే కుటుంబాలే ఈ పథకానికి అర్హులు. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించదు. కేవలం ఒక మీటర్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే అదే ఇంట్లో అద్దెకు ఎవరైనా ఉంటే....వారికి విడిగా మీటర్లు ఉంటే ఈ పథకాన్ని పొందవచ్చు. అయితే అద్దెకు ఉండేవారు వారి వివరాలు అందజేయాలి. అంటే వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కచోట మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బహుళా మీరు తెలంగాణలోనే ఏదైనా ఓ ప్రాంతం నుంచి హైదరాబాద్(Hyderabad) బతుకుదెరువు కోసం వచ్చారనుకోండి. ఇక్కడ గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే...ఊరిలో మీ ఇంట్లో ఉన్న మీటర్ కు మాత్రం కచ్చితంగా బిల్లు చెల్లించాల్సిందే. అక్కడ కావాలనుకుంటే ఇక్కడ వదులుకోవాల్సిందే. ఈవిషయం గుర్తుంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఎక్కడైనా ఒక్కచోట మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జీరో బిల్లు
గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలెవ్వరూ మీ సేవా కేంద్రాలు, ప్రత్యేక కేంద్రాల వద్దకు పరుగులు తీయాల్సిన పనిలేదని.... విద్యుత్ శాఖ సిబ్బందే ఇంటింటికి వచ్చి లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత యథావిధిగా మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇంటికి వచ్చి జీరోబిల్లు తీసి ఇస్తారని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుడు ఖర్చు చేసిన విద్యుత్ కు ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని తెలిపింది. ఆర్టీసీ(RTC) బస్సుల్లోనూ మహిళల ఉచిత ప్రయాణానికి జీరో బిల్లు టిక్కెట్ ఇస్తున్నారు. తర్వాత ఆ జీరో బిల్లుల ఆధారంగా ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ మెంట్ చేస్తుంది. అదే విధంగా జీరో కరెంట్ బిల్లులను సైతం ప్రభుత్వం చెల్లించనుంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో నోటిఫికేషన్ రాకముందే గ్యారెంటీలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ నిధులు కేటాయించడం జరిగింది.