Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు - తెలంగాణలో ఆ జిల్లాల్లో తేలికపాటి జల్లులతో ఉపశమనం
Rains In Andhra Pradesh: బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.
Weather Updates: అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తమిళనాడు, యానాం, ఒడిశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంట 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లా పలాస-తెక్కళ్ళి పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు), పార్వతీపురం మణ్యం జిల్లా సలూరు వైపు అక్కడక్కడ కొన్ని ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. విశాఖ ఏజెన్సీ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ సాయంకాలం వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ నగరం పరిసర ప్రాంతాలైన అనకాపల్లి, పెందుర్తి, పరవాడలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం జిల్లా సాలూరు వైపుగా కొన్ని భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి.
District wise weather forecast and warnings for Andhra Pradesh for next 5 days Dated 17.04.2022. pic.twitter.com/mv7rJdHQ2X
— MC Amaravati (@AmaravatiMc) April 17, 2022
పల్నాడు జిల్లా, ఎన్.టి.ఆర్. జిల్లా (విజయవాడ), కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లుల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతో ఏపీ ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, వి.కోట, చిత్తూరు టౌన్ సైడ్ భాగాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. అనంతపురం, సత్యసాయి (పుట్టపర్తి), కడప, చిత్తూరు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడాని వర్షాలు ఉన్నాయని జాగ్రత్త పడాలని సూచించారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు. వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత తగ్గి ఎండల నుంచి ప్రజలకు ఊపశమనం కలగనుంది.
Also Read: Gold-Silver Price: నేడు బంగారం ధరల్లో ఊరట - నిలకడగా పసిడి, వెండి రేట్లు
Also Read: Petrol-Diesel Price, 18 April: నేడు కొన్ని చోట్ల దిగొచ్చిన ఇంధన ధర - ఈ రెండు నగరాల్లో మాత్రం స్థిరం