Warangal News: రామప్ప కాలువలతో రైతన్నలకు కష్టాలు - నీళ్లున్న చివరి ఆయకట్టుకు తప్పని కన్నీళ్లు
Warangal News: రామప్ప కాలువలను మరమ్మతులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ గండ్లుపడి అన్నదాతలు తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నీళ్ల అందక పంటలన్నీ ఎండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Warangal News: కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు జలాలతో ఈ ప్రాంతం ధాన్యాగారంగా మారింది. ఎప్పుడో నిర్మించిన కాలువలకు మరమ్మతులు చేసే వారే కనిపించడం లేదు. కాలువల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యంతో ప్రతి ఏటా వర్షా కాలంలో గండ్లు పడుతున్నాయి. చాలాచోట్ల షెటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న నివేదికలకే పరిమితం అవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లు అభివృద్ధి చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నట్లు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు పడుతున్న కష్టాలను చూస్తే స్పష్టం అవుతుంది.
15వేల ఎకరాల భూమి సాగు..
ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రామప్ప సరస్సు జలాలతో 15 వేల వరకు ఆయకట్టు సాగు అవుతుంది. రెండు తూముల నుంచి వచ్చే నీటితో అధికారికంగా ఒగరు కాలువ కింద 1280 ఎకరాలు, నల్ల కాలువ క్రింద 2066 ఎకరాలు, సోమి కాలువ క్రింద 1488 ఎకరాలు, బూరుగు కాల్వ కింద 966 ఎకరాలు, కొత్త కాలువ కింద 220 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. కాల్వల వృధా జలాలు మోరంచల ప్రాంతాల్లో వసమాటు కింద 265 ఎకరాలు, కొండాపూర్ మాటు కింద 532 ఎకరాలు, చెల్పూరు మాటు కింద 780 ఎకరాలలో సాగు చేస్తున్నారు. అనధికారికంగా మరో 5 వేల ఎకరాలకు పైగా సాగు అవుతోంది.
అధ్వానంగా కాలువలు, రోడ్లు
వర్షా కాలంలో కాలువలకు గండ్లు పడుతుండడంతో వాటిని పూడ్చడం కష్టం అవుతుంది. రైతులే డబ్బు సమకూర్చుకొని కాల్వల మరమ్మతులు చేసుకున్న సంఘటనలే అధికం. అధికారులు నివేదికలు తయారు చేస్తున్నా నిధులు మాత్రం అనుకున్న విధంగా మంజూరు కావడం లేదు. పంట పొలాలకు వెళ్లే రోడ్లు ఇప్పటి వరకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కాలువల వెంట కిలో మీటర్ల మేర దారులను ఎడ్ల బండ్లు, వాహనాలు వెళ్లే విధంగా చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాల్వలకు గండ్లు పడిన చోట మరమ్మతులు చేసి రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. దూర ప్రాంతాలకు ఎరువులు తీసుకెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
చివరి ఆయకట్టుకు కన్నీళ్లే..
రామప్ప సరస్సు కింద ఉన్న ఒక్కో కాలువ సుమారు పది కిలో మీటర్ల పైనే పొడవు ఉంటుంది. ప్రతి రబీ పంట కాలంలో చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో నష్టపోతున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం వైయస్సార్ హయాంలో ఐదు కోట్ల నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు సరిగ్గా జరగలేదు. ప్రతి కాల్వ కింద సుమారు 20కి పైగా షట్టర్లు బిగించాల్సి ఉంది. గండ్ల ద్వారా నీటిని వదులుతుండడంతో నీరు వృధా అవుతోంది. ఇప్పటికీ రామప్ప రెండు తూములు సైతం చీడలతో లీకేజీ ద్వారా నీరు వృధాగా పోతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కాలువల పంట పొలాలకు వెళ్లే రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు కాలువలను ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లకి ముందు అభివృద్ధి చేసేలా నిధులు మంజూరు చేయించాలని ఆయకట్టు రైతన్నలు కోరుతున్నారు.