Sakini Ramachandraiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత, అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Telangana News | పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందిన సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆయనను 2022లో పద్మశ్రీ అవార్డు వరించింది.
Sakini Ramachandraih Death News | కొత్తగూడెం: తెలంగాణ ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరంలోని ఆయన స్వగృహంలో మృతిచెందారని బంధువులు తెలిపారు. కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వ్యక్తిగా సకిని రాంచంద్రయ్య గుర్తింపు పొందారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తరలించే వేళ సకిని రాంచంద్రయ్య కీలకంగా వ్యవహరించేవారు. కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ జానపద గీతాలు పాడేవారు, ఆదివాసీల కథలు సైతం చెప్పడంలో సిద్ధహస్తులు. కేంద్ర ప్రభుత్వం సకిని రాంచంద్రయ్య ప్రతిభను గుర్తించి 2022లో పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది.
ప్రభుత్వ సాయం అందలేదని ఆరోపణలు!
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ సకిని రామచంద్రయ్య పరిస్థితి చూసి చలించిపోయారు. కళాకారుడికి అండగా నిలిచి ఆర్థిక సాయం ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 426 గజాల ఇంటిస్థలం ఇస్తామని మాట ఇచ్చింది. అదనంగా కోటి రూపాయల నజరానా ప్రకటించింది. కానీ ఆయనకు గత రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నజరానా, ఇంటి స్థలం నేటికి అందించలేదని సకిని రాంచంద్రయ్య సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు అనారోగ్యం బారినపడి మంచంపట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య నేడు కన్నుమూశారు. ఆయన మరణంపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
12 ఏళ్ల నుంచి కళను బతికిస్తూ..
తాతముత్తాతల నుంచి వారసత్వంగా గిరిజన సంప్రదాయ కళను సకిని రామచంద్రయ్య ఓ బాధ్యతగా స్వీకరించారు. ఆయన 12 ఏళ్ల వయసులోనే ‘డోలి’ కళపై మక్కువ పెంచుకుని కళను బతికించారు. కాళ్లకు గజ్జె కట్టి, కంచు తాళం, మేళం చేతపట్టి.. డోలి వాయిస్తూ కోయలు, గిరిజనుల పుట్టు పూర్వోత్తరాలను పాటల రూపంలో కథలుగా చెప్పేవారు. జాతరలు, ఆదివాసీ పండుగలు, వివాహ శుభకార్యాల వద్ద డోలు వాయిద్యంతో సందడి చేసేవారు. ఎన్నో విషయాలను ఈ తరానికి అర్థమయ్యేలా చెబుతూ కళను బతికించిన ఆయన కన్నుమూయడం తీరని లోటుగా చెప్పవచ్చు.