Narsampet MLA : ఎమ్మెల్యే బర్త్‌డే కోసం మున్సిపల్ కౌన్సిల్ స్పెషల్ భేటీ - తెలంగాణలో వివాదం !
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకల కోసం ప్రత్యేకంగా మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Narsampet MLA : సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను ఎందుకు జరుపుతారు ? ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు నిర్వహిస్తారు. కానీ వరంగల్ జిల్లా నర్సంపేటలో మాత్రం ఎమ్మెల్యేకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి కూడా నిర్వహిస్తారు. ఇందు కోసం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. ఇలాజారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదమవుతుననాయి.
ఎమ్మెల్యే పుట్టిన రోజు జరపడానికి కౌన్సిల్ సమావేశానికి పిలుపు
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యేగా టీఆర్ఎస్‌కు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధీనంలోనే ఉంది. ఆరో తేదీన అంటే శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎవరిదన్నదానిపై స్పష్టత లేకపోయినా అధికారికంగా.. సమావేశం నిర్వహించాలన్న ఆదేశాలు మాత్రం మున్సిపల్ కమిషనర్ ఇవ్వాలి. ఆ ప్రకారం ఆదేశాలు వెలువడ్డాయి.
అందరూ తప్పనిసరిగా రాావాలని అధికారికంగా ఆదేశాలులో
ప్రతి ఒక్క వార్డు సభ్యుడు, సభ్యురాలికి ఈ ఆదేశాలు వెళ్లాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నందున అందరూ తప్పక రావాలని ఆదేశాల్లో ఉంది. ఈ ఆదేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తారు కానీ ఇలా పుట్టినరోజు వేడుకల కోసం నిర్వహిస్తారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాప్రతినిధుల పుట్టిన రోజుల నిర్వహణలో అత్యుత్సాహం
ఇటీవల కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదని ఓ అధికారి ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన అంశం కూడా వైరల్ అయింది. ఆ అధికారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సస్పెండ్ చేయాలని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నేత కూడా తమ పుట్టిన రోజుల కోసం ఏకంగా మున్సిపల్ కౌన్సిల్‌లను కూడా సమావేశపర్చాలని నిర్ణయించడం మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏమిటిది CM గారు.....మీ పార్టీ MLA ( నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి)గారి పుట్టిన రోజు అయితే, ప్రజా ప్రతినిధులు అందరూ వేడుకలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తారా.......నిన్నటి దాకా మీరు, మీ యువ రాజు, ఇప్పుడు మీ MLA లు.@TelanganaCMO pic.twitter.com/xjHVYObIv8
— RaniRudrama (@RaniRudrama) August 6, 2022