Mahabubnagar News: సమాచారం అడిగాడని దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి, సస్పెండ్ చేసిన కలెక్టర్
Mahabubnagar News: ఉపాధి హామీ పథకం కూలీ డబ్బులు రావడంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నించినందుకు ఓ దివ్యాంగుడిపై దాడి చేశాడో సర్పంచి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Mahabubnagar News: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడా మండలం పుల్పోనిపల్లిలో దారుణం జరిగింది. గ్రామ సర్పంచి దివ్యాంగుడిపై దాడి చేశాడు. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య.. ఉపాధి హామీ డబ్బులు సక్రమంగా రావట్లేదని, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని మండల సమాచార హక్కుల చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచి శ్రీనివాసులు గురువారం సాయంత్రం కృష్ణయ్య ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఎందుకు రావడం లేదని అడుగుతూ.. అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావంటూ కృష్ణయ్యను నిలదీశాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సర్పంచి శ్రీనివాసులు.. కృష్ణయ్యపై దాడి చేశారు. దాడి జరుగుతుండగా కొందరు యువకులు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
దివ్యాంగుడిపై సర్పంచి దాడి చేసిన వీడియోను జిల్లా ఎస్పీ చూశారు వెంటనే సర్పంచిపై కేసు చేసి అరెస్ట్ చేయాలని స్థానిక ఎస్సై రవి నాయక్ ను ఆదేశించారు. ఈ మేరకు సర్పంచిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. సర్పంచ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెంకట్రావ్ వెల్లడించారు. దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన సర్పంచిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఇటీవలే బాలికపై అత్యాచారం చేసిన సర్పంచ్..
వరంగల్ జిల్లాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, అతని అనుచరుడు బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం సర్పంచ్ దగ్గరకు వెళితే అతడు కూడా అత్యాచారం చేశాడని బాలిక ఆరోపిస్తుంది. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని బాలిక గ్రామ పెద్దలను ఆశ్రయించింది. వర్ధన్నపేట మండలం ల్యాబర్ధి గ్రామ సర్పంచ్ పస్తం రాజు, పత్రి నాగరాజు బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కడుపునొప్పి రావడంతో బాలిక ఆస్పత్రిలో చూపించుకుంటే నాలుగు నెలల గర్భిణి అని వైద్యులు తేల్చారు. తన కూతురుకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా సర్పంచ్, గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజీ ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు..
అయితే ఈ వ్యవహారం బయటకు రాకుండా అత్యాచారానికి గురైన బాలికను ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉంచారు కుటుంబ సభ్యులు. మరోవైపు తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితురాలి తల్లిదండ్రులను ఊరి చివర్లోని తోటలోకి తీసుకెళ్లి గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ముగిసిన తర్వాతే బాలికను బయటకు తీసుకురావాలని బాధితురాలి బంధువులు తల్లిదండ్రులకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
"నా బిడ్డపై సర్పంచ్, అతని అనుచరుడు అత్యాచారం చేశారు. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఈ విషయంపై వాళ్లిద్దరూ గొడవ కూడా పడ్డారు. పోలీసు కేసు పెడతానంటే వద్దని గ్రామ పెద్దలు అంటున్నారు. సర్పంచ్ తో మాట్లాడి న్యాయం చేద్దామని చెబుతున్నారు. నేను తోటలో పనికి పోతుంటాను. ఇలా బిడ్డను ఆగం చేశారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నాను." బాలిక తండ్రి ఆవేదనతో చెప్పారు.