Telangana MPs: పార్టీలు మారినా ఫేట్ మారలేదు, జంపింగ్ నేతలకు తప్పని ఓటమి - ఆ అదృష్టం ఒక్కరికే!
Telangana Loksabha Results 2024: అధికార పార్టీలో చేరితే విజయం ఖాయమని భావించి కాంగ్రెస్ లో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ అదృష్టం ఒక్కరినే వరించగా, మరో ముగ్గురు నేతలు ఓటమి పాలయ్యారు.
Warangal MP Kadiyam Kavya | వరంగల్: ఎన్నికలు రాగానే మొదట టికెట్ కోసం ఎదురుచూస్తారు, ఛాన్స్ లేదనుకుంటే చాలు ఆ పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేసి మరో పార్టీలోకి జంప్ అవుతుంటారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లోకి మారి టికెట్ దక్కించుకొన్న కొందరు నేతలు ఓటమి పాలయ్యారు. భారత రాష్ట్ర సమితి (BRS) అధికారానికి దూరం కాగానే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరికొందరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయగా ఒకే ఒక్కరు విజయం సాధించారు. మిగతా వారికి మాత్రం నిరాశే మిగిలింది. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి వరంగల్ ఎంపీ కడియం కావ్య.
అధికార పార్టీలోకి జంప్ అయిన నేతలు, కానీ!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేతలను ఆ పార్టీ ఈ పార్టీ నేతలు అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని దుస్థితి. అధికార పార్టీలో ఉంటే నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉంటే నాయకులం కాదు. అనే విధంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలి మారింది. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న అధికారానికి దూరమైన కొద్ది రోజులకే నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు జరిగింది. భారత రాష్ట్ర సమితి (BRS) అధికారానికి దూరం కాగానే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. అంతే కాదు సీట్లు దక్కించుకుని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య ఉన్నారు.
పార్టీ మారినా, మారని ఫేట్.. తప్పని ఓటమి
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి, కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే పార్టీ మారినా వారి ఫేట్ మాత్రం మారలేదు. అధికార పార్టీలో ఉంటే విజయం తథ్యమని భావించిన ఈ నేతలకు నిరాశే ఎదురైంది. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో రంజిత్ రెడ్డి ఓటమి చెందారు.
మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన సునీతా రెడ్డి.. ఈటల రాజేందర్ చేతిలో 3,91,475 ఓట్ల తేడాతో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కిషన్ రెడ్డి చేతితో 49,944 ఓట్ల తేడాతో దానం నాగేందర్ కు ఓటమి తప్పలేదు. అయితే పార్టీ మారిన వారిలో వరంగల్ లో కడియం కావ్య ఒక్కరే విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,20,339 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు. ఇక్కడ ప్రత్యర్థి అంత స్ట్రాంగ్ కాకపోవడంతో కావ్య గెలుపొందారని వినిపిస్తోంది. అధికారం కోసం రాత్రికి రాత్రి పార్టీలు మారినా, ఎన్నికల్లో ఓటు వేయకుండా వారిని ప్రజలు ఓడించి ఇంటికి పంపినట్లు అయింది.