Maoists Latest News: మావోయిస్టు ఉద్యమానికి మందుపాతర 'కోవర్టు ఆపరేషన్'
Maoists News: మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత వారికి ప్రమాదకరంగా మారింది ఎవరైనా ఉన్నారంటే అది కోవర్టులే. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపర్చడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాల్లో కోవర్టు ఆపరేషన్స్ ఒకటి.

Maoists Latest News: మావోయిస్టు పార్టీ ఏర్పడిన నాటి నుంచి వారికి అత్యంత తీవ్రమైన ముప్పును తెచ్చిపెట్టింది కోవర్టు ఆపరేషన్లే. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాల్లో ఇది చాలా కీలకమైనది. ఈ ఆపరేషన్ల ద్వారానే పోలీసు బలగాలు విజయాలు సాధించాయి. అడవుల్లో పట్టు సాధించే అవకాశాలు ఉన్న నక్సలైట్లు పోలీసుల ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడానికి కోవర్టులే ప్రధాన కారణం. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రాణాలు కోల్పోవడానికి కూడా కోవర్టు ఆపరేషనే కారణమని మావోయిస్టులు తమ లేఖ ద్వారా బహిర్గతం చేశారు.
కోవర్టు ఆపరేషన్ల ఆరంభం
దేశంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తొలి నాళ్లలో, అంటే 1967-1970 మధ్య కాలంలోనే పోలీసులు కోవర్టు ఆపరేషన్లకు తెర తీసినట్లు మాజీ మావోయిస్టులు చెబుతారు. అప్పటి నుంచే నక్సల్స్ అంతర్గత సమాచారం సేకరించడం, వారి మధ్య విభేదాలు సృష్టించడం వంటి చర్యలను కోవర్టు ఆపరేషన్ల ద్వారా పోలీసులు ప్రవేశపెట్టారు. కోవర్టు ఆపరేషన్ అనేది పోలీసుల అంతర్గత వ్యూహంగా చెబుతారు. అయితే, తొలి కోవర్టు ఆపరేషన్ ఎప్పుడు జరిగిందనేది నిర్దిష్టంగా తెలియకపోయినా, 2005లో నిజామాబాద్ జిల్లాలోని మానాల ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టు పార్టీ ఓ పెద్ద కోవర్టు ఆపరేషన్‌గా ప్రకటించింది. ఆ ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు చనిపోయారు.
అంతకు ముందు కూడా కోవర్టు ఆపరేషన్ల ఆరోపణలు ఉన్నాయి:
- 1991లో కరీంనగర్ జిల్లాకు చెందిన కత్తుల సమ్మయ్య హుస్నాబాద్ దళంలో పని చేస్తూ కోవర్టుగా మారి హిమాయత్‌నగర్‌లో భూపతి దళంపై కాల్పులు జరిపి అతనితో పాటు మరో ఇద్దరిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- కరీంనగర్ జిల్లాకే చెందిన శివకుమార్ సికాస సానుభూతిపరుడిగా పనిచేస్తూ పోలీసుల సాయంతో సికాస నేత రమాకాంత్, మరో ఇద్దరు సభ్యుల ఎన్‌కౌంటర్‌కు బాధ్యుడైనట్లు ఆరోపణలు వచ్చాయి.
- 1999లో జడల నాగరాజు పీపుల్స్ వార్ పార్టీలో దళ సభ్యుడిగా చేరి దళ నేత అయిన కొట్టే పురుషోత్తం అలియాస్ విజయ్‌ను కాల్చి చంపి పోలీసులకు లొంగిపోయాడు. దీనిని పీపుల్స్ వార్ పార్టీ కోవర్టు ఆపరేషన్‌గా ప్రకటించింది. ఇతను నయీం ముఠా సభ్యుడు.
మావోయిస్టు పార్టీగా రూపుదిద్దుకోక ముందు నుంచే ఉద్యమ పార్టీకి కోవర్టులతో ఇబ్బందులు తప్పలేదు.
కోవర్టుల వల్లే పార్టీ అగ్రనేతలు హతం
పోలీసులు మావోయిస్టు పార్టీలో ముఖ్య నేతలు, అగ్రనేతలను పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో వారి సంచారం, అనేక వలయాలతో కూడిన రక్షణ ఛత్రాలు అగ్రనేతలను కాపాడుతుంటాయి. వారు షెల్టర్ తీసుకున్నా, లేదా ఏదైనా ముఖ్య సమావేశాల్లో పాల్గొన్నా వారి కదలికలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఇంతటి పకడ్బందీ ప్రణాళికతో ఉన్నా, పోలీసులు వారిని మట్టుబెట్టగలుగుతున్నారంటే కోవర్టు ఆపరేషన్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కోవర్టుల ద్వారా లభించే సమాచారంతోనే మావోయిస్టు పార్టీ అగ్రనేతలను అంతమొందించిన సంఘటనలు చాలా ఉన్నాయి. గత పదేళ్లలో మావోయిస్టు పార్టీ చాలా మంది అగ్రనేతలను కోల్పోయింది.
కొన్ని ప్రముఖ సంఘటనలు:
- నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (2025): మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయిన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ కూడా కోవర్టు ఆపరేషన్ వల్లే జరిగిందని మావోయిస్టు పార్టీ తమ లేఖలో స్పష్టం చేసింది. పార్టీలోని పీపీసీ సభ్యుడు తన భార్యతో సహా ఎన్‌కౌంటర్‌కు ముందు రోజు పారిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే ఈ సంఘటన జరిగిందని పార్టీ ధృవీకరించింది.
- రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి (2025 జనవరి): ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. మోస్ట్ వాంటెడ్ నక్సల్ నేత హిడ్మాకు గురువుగా పేరుంది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లే ఇతని ఎన్‌కౌంటర్ జరిగిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
- కిషన్‌జీ (కోటేశ్వరరావు) (2011 నవంబర్): మావోయిస్టు పార్టీకి జరిగిన అతిపెద్ద నష్టాల్లో ఒకటి. పొలిట్‌బ్యూరో సభ్యుడు, తూర్పు జోనల్ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శి. సన్నిహితంగా ఉండే మావోయిస్టు సభ్యులే కోవర్టులుగా పనిచేయడం వల్ల పోలీసులు ఆయన్ను పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ నమ్ముతోంది.
- గార్ల రవి అలియాస్ దయా (2016 అక్టోబర్): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో పోలీసులు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇతనితో పాటు 30 మంది మావోయిస్టులు మరణించారు. దీనిని పక్కా కోవర్టు ఆపరేషన్‌గా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇతను వైఎస్ హయాంలో శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సల్స్ నేత.
- మల్లి రాజ్ రెడ్డి అలియాస్ సాగర్ అలియాస్ మల్లిక్ (2018): మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడు, బీజాపూర్ జిల్లా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఈయన మరణించారు. కోవర్టులు అందించిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
కోవర్టులను శిక్షించిన మావోయిస్టులు
మావోయిస్టు పార్టీ కూడా ఇలాంటి కోవర్టులను గుర్తించి శిక్షించిన సందర్భాలు ఉన్నాయి:
- విజ్జ (సౌత్ బస్తర్ నివాసి) (2024 సెప్టెంబర్): కంకేర్ బోర్డర్ డివిజన్ కమిటీకి చెందిన ఏసీఎం. ఇతన్ని కోవర్టుగా మావోయిస్టు పార్టీ గుర్తించి చంపింది.
- మనీశ్ కుర్సం అలియాస్ రాజు (2024 ఆగస్టు): పామేడ్ ఏరియాలో నక్సల్ కమ్యూనికేషన్ టీం సభ్యుడిగా పనిచేశారు. ఇన్ఫార్మర్‌గా మావోయిస్టు పార్టీ గుర్తించి చంపివేయడం జరిగింది.
- బంటి రాధ అలియాస్ నీల్సో (2024 ఆగస్టు): మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేశారు. ఇన్ఫార్మర్ పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో చంపడం జరిగింది. పోలీసులకు రహస్యాలు అందిస్తోందంటూ మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
- ఆమెతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లాలోని బైరామ్‌ఘడ్ పరిధిలో సీతూ మండావి అనే వ్యక్తిని మావోయిస్టులు కోవర్టు పేరుతో చంపడం జరిగింది.
- అంతకు ముందు 2016లో పోలీసులు ఇన్ఫార్మర్ల పేరుతో జార్ఖండ్-బిహార్‌లో చిరాగ్ అనే మావోయిస్టు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ముగ్గురు కోవర్టులకు శిరచ్ఛేదనం చేయడం జరిగింది.
- 2020లో ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది గిరిజనులను మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కోవర్టుల పేరుతో ప్రజా కోర్టు నిర్వహించి చంపివేయడం జరిగింది. వీరి వల్ల పార్టీ నాయకులు ఎన్‌కౌంటర్ అయ్యారని ఆరోపించింది.
ఇలా అడపా దడపా పార్టీలో కోవర్టు ఆపరేషన్లకు సహకరించే సభ్యులను, బయటి నుండి సహకరించే వారిని గుర్తించి ప్రజా కోర్టు పేరుతో శిక్షించినప్పటికీ, కోవర్టు ఆపరేషన్లు మాత్రం ఆగలేదు. పోలీసులకు కోవర్టు ఆపరేషన్లు చాలా కీలకమైన అస్త్రంగా మారాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని తుంచివేయడం, పార్టీలో అపనమ్మకం పెంచడం ద్వారా ఐక్యతను దెబ్బతీయడం, భారీ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు కోవర్టు ఆపరేషన్లు కీలకమైనవిగా మారాయి. దీంతో పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు కోవర్టు ఆపరేషన్లకు పదును పెడుతూనే ఉన్నాయి.






















