Station Ghanpur: టికెట్ నాదే, గెలుపూ నాదే - మరోసారి అగ్గిరాజేసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడికి వెళ్ళినా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. ఆధిపత్యం చాటుకొనేందుకు ఒకరికి మించి మరొకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ టికెట్ కోసం ఈ నేతల సమరం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడికి వెళ్ళినా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామిని తాజాగా దర్శించుకున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మరోసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తనను మించిన వీర విధేయుడు కేసీఆర్ కు ఇంకా ఎవరూ లేరు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఏ రకంగా చూసిన టికెట్ నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. టికెట్ నాదే గెలుపు నాదే అంటూ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితమే తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తల వంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పుచేసినోడే తలవంచుతాడని వ్యాఖ్యలు చేశారు. అయితే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పరోక్షంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతోంది.
శుక్రవారం (జనవరి 13) జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయొద్దని హితవు పలికారు. ఆ తర్వాత అయ్యా.. అయ్యా అంటూ తలవంచి పాదాభివందనం చేయాల్సిన అవసరం రాకూడదని అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా తప్పు చేసి తల వంచడం చూశారా అని సభ ముందున్న వారిని అడిగారు. ప్రతి ఒక్కరు తన మాదిరిగా నిటారుగా బతకడం నేర్చుకోవాలని శ్రీహరి సూచించారు. అందరూ ఆత్మగౌరవంతోనే బతకాలని సూచించారు. విద్యతో సామాజిక చైతన్యం వస్తుందని తద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.