MLA Etela Rajender: రాజ్యాంగం సాక్షిగా మన కండ్లలో మట్టి కొడుతున్నారు, ఇకనైనా మారండి- ఎమ్మెల్యే ఈటల
బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ లో తెలంగాణ లో బీసీలకు రాజ్యాధికారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు.

వరంగల్: నాటి నుంచి నేటి వరకు బీసీలు రాజ్యాధికారంకు నోచుకోలేదని, తెలంగాణలాంటి చైతన్య వంతమైన గడ్డ మీద మనం ఉన్నా ఐక్యత సాధించలేక పోతున్నాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ లో తెలంగాణ లో బీసీలకు రాజ్యాధికారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( BJP MLA Etela Rajender) మాట్లాడారు. ఓరుగల్లు మొదటి నుంచి చైతన్యానికి మారు పేరుగా నిలుస్తుందన్నారు. అట్టడుగు వర్గాల నుంచి రాజ్యాధికారం సాధించిన రాష్ట్రం బిహార్ అన్నారు.
నూటికి నూరు శాతం అణగారిన వర్గాలకు చెందిన రాష్ట్రం తెలంగాణ. అవకాశం వస్తె శక్తి సత్తా చాటగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం బలహీన వర్గాల ప్రజలం. అందుకే ఉద్యమ సమయంలో దళితుడు మొదటి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కేసీఆర్ ఎలా వ్యవహరించారో ఏలా మాట తప్పారో తెలంగాణ సమాజం చూసిందన్నారు. బీసీల్లో ఐక్యత రానంతవరకు, ఐక్యత లోపించినంత కాలం రాజ్యాధికారంకు మనం దూరం అవుతాం అన్నారు ఈటల రాజేందర్.
మన కండ్లలో మట్టి కొడుతున్నారు
రాజ్యాంగం సాక్షిగా మన కండ్లలో మట్టి కొడుతున్నారు. రిజర్వేషన్ ను చూపుతూ అణగారిన వర్గాల ప్రజలను చిన్నచూపు చూసిన రోజులున్నాయి. రాజ్యాధికారం మనకు తెలియకుండానే మన నుంచి జారిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మన అప్రమత్తత లోపించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. డబ్బులు లేకుండా పోటీ చేస్తే సపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చైతన్యం చంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి. చైతన్యం రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు ఈటల.
హుజూరాబాద్ ఉప ఎన్నికలు నిరూపించాయి..
ప్రజల్లో చైతన్యం బతికే ఉంది అనడానికి నిదర్శనం హుజూరాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలు అని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఉన్న సరిగా పని చేయకున్న ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు. ప్రజా ప్రతినిధులను మార్కెట్ లో వస్తువుల్లా కొనుగోలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించారని వారిని ఈటల రాజేందర్ ప్రశంసించారు. ఈ ఫలితాలు రాష్ట్రం మొత్తం ఆవిష్కారం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధం అంటూ జరిగితే విజయం సాధించే సత్తా మనకు ఉన్నదని నిరూపించే సమయం ఆసన్నం అవుతుంది. త్యాగాలు చేసిన వారు అందరూ అణగారిన వర్గాలకు చెందిన వారేనన్నారు.
రాజకీయాల్లో మెరిట్ తప్పకుండా ఉండాలి
నీ చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం చేసుకోవద్దు. ఉద్యోగాలు సాధించేందుకు ఉన్నట్టు రాజకీయాల్లో మెరిట్ తప్పకుండా ఉండాలి. సేవ చేసే గుణంలో మెరిట్ ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే మెరిట్ ఉన్న వారే పాలకులు కావాలి. రాజ్యాంగంపై పట్టు అంబేద్కర్ ఆశయ సాధనకోసం పని చేసే మనసున్న వారు పాలకులు కావాలని ఈటల రాజేందర్ అన్నారు. అటువంటి నాయకులను ఎన్నుకునే సోయి ప్రజలకు రావాలని, అప్పుడే అంబేద్కర్ కలలు కన్న సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు.





















