Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్
Warangal CP AV Ranganath : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఫ్లెక్సీలు భూతగాదా బాధితులు పాలాభిషేకాలు చేస్తున్నారు. వీటిపై స్పందించిన సీపీ తన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించానని చెప్పారు.
Warangal CP AV Ranganath : నా ఉద్యోగ నిర్వహణలో భాగంగానే భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. భూ బాధితులు ఎవరు తన చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి పాలభిషేకాలు చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ భూబాధితులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు భూకబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో పాటు భూకబ్జారాయుళ్ల భరతం పడుతున్నారు సీపీ ఏవీ రంగనాథ్. వరంగల్ పోలీస్ కమిషనర్ ద్వారా న్యాయం పొందిన బాధితులు రంగనాథ్ పై తమ అభిమానం చాటడంతో పాటు కృతజ్ఞత భావంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలభిషేకాలు చేస్తున్నారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నా ఉద్యోగ బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పేదవారికి తగురీతిలో న్యాయం చేయడంతో పాటు వారికి వెన్నంటి ఉంటున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. నా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ పేదలకు న్యాయం చేసే దిశగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఇదే రీతిలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతయుతంగా నిర్వహిస్తూ నిరుపేదలకు న్యాయం అందిస్తున్నారన్నారు. తద్వారా కమిషనరేట్ పరిధిలో పలు భూకబ్జా కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో తిరిగి తమ భూములను పొందిన బాధితులు తనకు కృతజ్ఞతలు తెలుపుకునే రీతిలో ఫ్లెక్సీలకు పాలభిషేకాలు చేయడం సరికాదన్నారు. నిరంతరం శాంతి భద్రతలను పరివేక్షించడంతో పాటు నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే భూకబ్జా కేసులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో లోతుగా విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో చట్ట పరిధిలో బాధితులకు న్యాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు నిరంతరం బాధితుల పక్షాన నిలుస్తారన్నారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసుల కర్తవ్యంలో ఒక భాగమేనని, పోలీసులపై అభిమానాన్ని చాటేందుకు పాలభిషేకాలు చేయాల్సి అవసరం లేదని పోలీస్ కమిషనర్ ఏపీ రంగనాథ్ ప్రజలకు సూచించారు.
సీపీ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి ఇటీవల రైతులు పాలాభిషేకం చేశారు. తమకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు సీపీ ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేశారు. రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018లో అమ్మినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్లమే ఉంటున్నామన్నారు. అయితే కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరికొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆవేదన చెందారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు తమకు జరిగిన అన్యాయం గురించి రైతు దంపతులు చెప్పుకున్నారు. దీంతో ఆయన విచారణ జరిపి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారని రైతు వీరస్వామి తెలిపారు. దీంతో 11 మందిపై నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భూమిని నమ్ముకొని, సాగు చేసుకొని బతికే తమకు సీపీ రంగనాథ్ న్యాయం చేశారని, అందుకే ఆయన ఫ్లెక్సీకీ పాలతో అభిషేకం చేశామని రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు. అలాగే డీసీపీ కరుణాకర్ కు , పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.