Minister Errabelli: రాష్ట్రానికి నయాపైసా ఇయ్యని బీజేపోళ్లు కూడా మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి
Minister Errabelli: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.
TS Minister Errabelli: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ పథకాలను గడపగడపకు తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మొరిపిరాల క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని.. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, రైతు బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకాలు దేశానికే దిక్సూచీలుగా మారాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు.
మరోవైపు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధి కి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు. తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపీ నేతలు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, దయాకర్ రావు నిరంతరం నియోకవర్గ అభివృద్ధి గురించి, ప్రజల గురించే ఆలోచిస్తారని వెల్లడించారు. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కడుపులో పెట్టుకుని దీవించాలని కోరారు.
మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు..
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో కలిసి ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు. అనంతరం గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు.