Eng vs Ind Test: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వనపర్తి యువకుడు
సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించేందుకు వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన యువకుడు షోయబ్‌కు అవకాశం వచ్చింది.
![Eng vs Ind Test: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వనపర్తి యువకుడు Wanaparthy man as cricket commentator for Eng vs Ind Test 2021 Eng vs Ind Test: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వనపర్తి యువకుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/aa0d412144b1f863a339aeae875b392f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇంగ్లండ్ లండన్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న 4, 5వ టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. ఆ మ్యాచ్‌కు.. తెలంగాణ యువకుడికి ఓ రిలేషన్ ఉంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు వనపర్తి జిల్లా యువకుడు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఆ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించేందుకు వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన యువకుడు షోయబ్‌కు అవకాశం వచ్చింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన సోయబ్ అనే ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈయన క్రికెట్ ఆటగాడిగా, కామెంటేటర్‌గా రాణించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఇలా క్రికెట్‌పై ఉన్న ఇష్టమే ఇతణ్ని టీవీ కామెంటేటర్‌గా మార్చింది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ మధ్య అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2 నుంచి 6 వరకు 4వ టెస్టు జరగనుంది. అయితే, సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్ తరఫున షోయబ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే 5వ టెస్టు మ్యాచ్‌కి ఈ నెల 10 నుంచి 14 వరకు ముంబయిలోని టీవీ స్టూడియోలో తెలుగు కామెంటరీ చేయనున్నాడు.
కామెంటేటర్‌గా ఇలా..
గతంలో షోయబ్ కొన్ని జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు రేడియోలో కూడా వ్యాఖ్యానం చేశాడు. ప్రస్తుతం భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు ఐదో టెస్టుకు ముంబయిలోని సోనీ నెట్‌వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నాడు.
పెబ్బేరు పట్టణంలోని నజీమా బేగం, నయీం దంపతుల కుమారుడు షోయబ్. వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. 14 ఏళ్ల కిందట ఆయన తండ్రి నయీం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తర్వాత ఈ యువకుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. తన స్నేహితులతో కలిసి ఆడుతున్నప్పుడు హిందీ, ఇంగ్లీషు, తెలుగులో కామెంటరీ చేయడం అలవాటుగా చేసుకొని రాష్ట్ర స్థాయిలో వ్యాఖ్యాతగా ఎదిగాడు.
మంత్రి అభినందనలు
వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు వ్యాఖ్యాతగా ఎంపిక కావడం పట్ల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ను అభినందించారు. మంత్రితో పాటు పెబ్బేరు పట్టణ వాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)