Warangal News: అర్చకునికి ఆలయం - ఆయుర్వేద వైద్యునిపై గ్రామస్థుల అభిమానం, ఎక్కడంటే.?
Temple For Preist: దేవుడికి గుడి కట్టడం చూశాం. రాజకీయ నేతలకు విగ్రహాలు పెట్టడం చూశాం. కానీ ఆ గ్రామస్థులు ఏకంగా ఓ పూజారికే గుడి కట్టారు. జనగాం జిల్లాలో ఈ నిర్మాణం వెనుక కథ ఏంటో తెలుశా.!
Villagers Construct a Temple For a Priest in Jangaon: మనం సాధారణంగా ఏ గ్రామంలోనైనా దేవుళ్లకు గుడి కట్టడం చూస్తాం. కొందరు తమ అభిమాన రాజకీయ నేతలకు విగ్రహాలు పెట్టడమూ చూశాం. అయితే, ఆ గ్రామస్థులు ఏకంగా ఆలయంలో పూజలు చేసే పూజారికే గుడి కట్టారు. నిత్య అర్చకులుగా, ఆయుర్వేద వైద్యులుగా సేవలందించిన ఆయన రుణం తీర్చుకోలేనిదంటూ పూజారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనగామ జిల్లా (Janagaon) తాటికొండ (Tatikonda) గ్రామస్థులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ప్రజాసేవలో
జనగామ జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన సౌమిత్రి శ్రీ రంగాచార్యులు (Rangacharyulu) ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు. గ్రామంలోని శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయంలో నిత్య అర్చకులుగా, గ్రామంలో ఆయుర్వేద వైద్యులుగా 50 ఏళ్లకు పైగా గ్రామస్థులకు సేవలందించారు. ప్రతి ఒక్కరినీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆదరించారు. అందరినీ స్నేహ పూర్వకంగా పలకరించి తనకు తోచిన సాయం అందించేవారు. ఆయుర్వేద వైద్యులుగా ప్రసిద్ధి చెంది గ్రామస్థులు వైద్య సహాయం అందించేవారు. అయితే, ఏడాది క్రితం రంగాచార్యులు కన్నుమూశారు. అయితే, ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేక గ్రామస్థులు రంగాచార్యులకు విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు సంతోషంగా అంగీకరించారు.
రూ.4 లక్షలతో ఏర్పాటు
అనుకున్నదే తడవుగా గ్రామంలోని పురాతన సీతారామ ఆంజనేయ దేవస్థానం పక్కనే ఉన్న స్థలంలో శ్రీ రంగాచార్యులకు గుడి కట్టి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 లక్షలతో నిర్మాణం చేపట్టి ఇటీవలే విగ్రహాన్ని ప్రతిష్టించారు. తన తండ్రి అందరినీ స్నేహభావంతో చూసేవారని, వైద్య సేవలు అందించారని ఆయన కుమారుడు రామాచార్యులు తెలిపారు. గ్రామస్థులు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు సంతోషంగా అనిపించిందని చెప్పారు. అందరి సహకారంతోనే ఈ నిర్మాణం పూర్తైనట్లు పేర్కొన్నారు. కాగా, గ్రామంలో తాత పౌరోహిత్యాన్ని, అర్చకత్వాన్ని ఆయన మనవడు అరుణాచారి కొనసాగిస్తున్నారు. ఆయన గ్రామంలోని సీతారాం సీతారామాంజనేయ స్వామి దేవాలయ అర్చకులతో పాటు శ్రీ రంగాచార్యుల దేవాలయం అర్చకులుగానూ కొనసాగుతున్నారు.
అయితే, రంగాచార్యుల గురువు చాలా ఉన్నత వ్యక్తి అని, ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ వైద్య సేవలందించారని గ్రామస్థులు కొనియాడారు. అందరినీ ఎంతో ప్రేమతో ఆదరించేవారని, ఎవరికి ఏ సహాయం కావాలన్నా.. తన వంతు సహకారం అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనపై అభిమానంతో ఆలయం నిర్మించినట్లు చెప్పారు.
Also Read: Konda Surekha: కాళేశ్వరంపై విచారణ అంటే కేసీఆర్, కేటీఆర్‌లలో వణుకు మొదలైంది: మంత్రి కొండా సురేఖ