Vikarabad: వాగులో కొట్టుకుపోయిన కారు, చెట్టును పట్టుకొని అంతా సేఫ్! రాత్రంతా దానిపైనే
రాత్రి అక్కడ ఎవరూ లేకపోవడంతో సాయం కోసం ఆ చెట్టుపైనే ఉండిపోయారు. ఉదయాన్నే స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సాయం అందించారు.
వికారాబాద్ జిల్లాలో వరద నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. జిల్లాలోని ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగు ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకు పోయింది. డ్రైవర్ వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకెళ్లడంతో ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. కానీ అందులో ఉన్న ఇద్దరు దంపతులు గట్టు వద్ద ఉన్న చెట్టు అడ్డురావడంతో దానికి తగిలి ఆగారు. కారు నుంచి బయటకు వచ్చి ఎత్తయిన కొమ్మల సహాయంతో చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ రాత్రి అక్కడ ఎవరూ లేకపోవడంతో సాయం కోసం ఆ చెట్టుపైనే ఉండిపోయారు. ఉదయాన్నే స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సాయం అందించడంతో వారు సహాయక కార్యక్రమాలు చేపట్టి, వారికి బయటికి రప్పించారు.
మరోవైపు, డ్రైవర్ కి కూడా వరద నుండి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. అతను కూడా ఓ చెట్టును పట్టుకున్నాడు. కానీ, వేరే దారి లేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రంతా చెట్టు మీదనే వేలాడుతూ సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారు డ్రైవర్ నీటి ప్రవాహాన్ని గుర్తించకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. కానీ వరద నీటి ధాటికి కారు కొట్టుకుపోయింది. వెంటనే కారు డ్రైవరు చెట్టును పట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరూ ఈదుకుంటూ బయటపడ్డారు. అనంతరం కేకలు వేయడంతో గ్రామస్తులు చెట్టుపై నుంచి డ్రైవర్‌ను రక్షించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. పాత చెరువుకు వెళ్లే కలుకట్ట తెగిపోవడంతో పలు కాలనీలు జలమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కమిషనర్, సిబ్బంది తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో పంట పొలాల నుండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్ద ఉమ్మెంతాల్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురవగా, వికారాబాద్ జిల్లా పరిగిలో 10.5 సెంటీమీటర్లు. వికారాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రెండ్రోజులు వర్షాలే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు.
ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, పీర్జాదిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. అంబర్‌పేట, ముసారంబాగ్, మలక్‌పేటలోనూ భారీవర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, కోఠిలో భారీ వర్షం పడింది.