vijayashanthi BJP : తెలంగాణ బీజేపీలో విజయశాంతి కలకలం - మణిపూర్ పై సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ట్వీట్ !
మణిపూర్ ఘటనలపై విజయశాంతి విమర్శనాత్మకంగా స్పందించారు. రాములమ్మ స్పందన చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
vijayashanthi BJP : తెలంగాణ బీజేపీలో పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలోకి విజయశాంతి కూడా చేరారు. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఆమె బీజేపీకి వ్యతిరేక ట్వీట్ చేశారు. మణిపూర్ అంశంపై స్పందించారు. మణిపూర్ ఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి వరుస పరిణమాలతో సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతోందన్నారు. అల్లర్లకు, అమానవీయ సంఘటనలకు బాధ్యులైన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
మణిపూర్ అంశంపై విజయశాంతి ట్వీట్ హాట్ టాపిక్
మణిపూర్ అంశం చాలా రోజులుగా వార్తల్లో ఉంది కానీ. రాములమ్మ ఎప్పుడూ స్పందించ లేదు. మొదటి సారి స్పందించారు. దీంతో ఆమె ఆ ట్వీట్ వెనుక అసలు ఇంటెన్షన్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీజేపీలో రాములమ్మ మాటే వినిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి పదవులు వస్తున్నాయి. అయినా రాములమ్మకు ఓ పదవి ఇద్దామని హైకమాండ్ కూడా అనుకోవడం లేదు. సమావేశాలకూ పిలవడం లేదు. దీంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. వెంటనే వచ్చేశారు. ఎందుకంటే..అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్న కారణం చెప్పారు. కిరణ్ ఇప్పుడు బీజేపీ నేతే కదా అని సొంత పార్టీ నేతలు విస్మయానికి గురయ్యారు.
బీజేపీలో ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న విజయశాంతి
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేటప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉండేవారు. బీజేపీలో చేరాక... అసలు ఆమె పొజిషన్ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు. అందుకే తన అసంతృప్తిని ట్వీట్ల ద్వారా వినిపిస్తున్నారు. కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్నదే అసలు డౌట్. విజయశాంతికి ప్రత్యేకంగాఓ నియోజకవర్గం అంటూ లేదు. మెదక్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా గెలిచినా తర్వాత కాంగ్రెస్ లో మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ా తర్వాత మళ్లీ మెదక్ వైపు చూడలేదు.
విజయశాంతి అసంతృప్తిని హైకమాండ్ అయినా పట్టించుకుంటుందా ?
ఎంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంతో ఆమె జాతీయ స్థాయిలో పార్టీకి తన అసంతృప్తి తెలిపేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. గతంలో బండి సంజయ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసేవారు. తర్వాత బండి సంజయ్ కే మద్దతు పలికారు. ఇప్పుడు కి,న్ రెడ్డికి ప్రాధాన్యం లభిస్తోంది.. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాను అనుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదని రాములమ్మ ఫీలవుతున్నారు.