Kishan Reddy: బీజేపీ-కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటి కాదు, బీఆర్ఎస్ విమర్శలకు కిషన్ రెడ్డి కౌంటర్
Telangana: బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటి కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.
Congress And Bjp: కాంగ్రెస్-బీజేపీ ఒక్కటేనంటూ బీఆర్ఎస్ చేస్తున్ను ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని బహిరంగ సభలో అన్నంత మాత్రాన బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటవుతాయా? అని ప్రశ్నించారు. మోదీని పెద్దన్న అని రేవంత్ ఎందుకు అన్నారో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సక్సెస్ అయిందని, బహిరంగ సభలకు జనాలు భారీగా తరలివచ్చారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంకు వచ్చిన కిషన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం ఎల్‌ఈడీ క్యాంపెయిన్ రథాలను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని, హామీలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.
త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు
త్వరలో ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలు చేపడతామని కిషన్ రెడ్డి తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్ లాంటి హామీలపై రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. అటు పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన కోసం బుధవారం నుంచి సలహాలు స్వీకరిస్తామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు. గత పదేళ్లల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్-బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని, అలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చింది
'పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లును గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజలకు క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టింది. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయరహదారులు రెండు రెట్లు పెరిగాయి. పదేళ్లలో మరో 2500 కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం జరిగింది. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరిగింది. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టింది. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ మంజూరు చేసింది' అని కిషన్ రెడ్డి తెలిపారు.
మూడు పార్టీలు తెలంగాణను దోచుకున్నాయి
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారని, అది సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మార్పు వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో ఏ రకమైన మార్పు కనిపించట్లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని, కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం జత కలిసిందని, మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకున్నామని విమర్శించారు.