Telugu Students: తీవ్ర విషాదం - ట్రెక్కింగ్ కు వెళ్లి స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telangana News: ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వెళ్లి నీళ్లలో జారిపడి మృతి చెందారు.
Telugu Students Died In Scotland: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లారు. అలా చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి పెర్త్ షైర్ లోని 'లిన్ ఆఫ్ తమ్మెల్'కు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అనంతరం కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా.. మరో విద్యార్థి ఏపీపి చెందిన వారు.
అటు, ఈ ప్రమాదంపై లండన్ లోని భారత హైకమిషన్ అధికారి స్పందించారు. 'బుధవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. భారత కాన్సులేట్ జనరల్ ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించాం. యూకేలోని విద్యార్థుల బంధువలకు కూడా సమాచారం ఇచ్చాం. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను భారత్ కు పంపించే ఏర్పాట్లు చేస్తాం.' అని పేర్కొన్నారు.
ఘటనపై డూండీ వర్శిటీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై స్పందించిన యూనివర్శిటీ ఆఫ్ డూండీ ప్రతినిధి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఇది మనందరికీ దిగ్భ్రాంతిని గురి చేసిన ఓ విషాద ప్రమాదం. అత్యంత క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం.' అని పేర్కొన్నారు. కాగా, జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్ వర్శిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య 2022లోనే హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం.