Free Bus Service: '45 రోజుల్లో 12 కోట్ల మందికి పైగా మహిళల ఉచిత ప్రయాణం' - టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Mahalaxmi Scheme: రాష్ట్రంలో 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద 45 రోజుల్లో 12 కోట్ల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
TSRTC MD Vc Sajjanar Key Comments on Free Bus Service Scheme: తెలంగాణలో (Telangana) 'ఉచిత బస్సు ప్రయాణం' ఓ చారిత్రక నిర్ణయమని టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో 45 రోజుల్లో 12 కోట్ల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు వెల్లడించారు. నాంపల్లిలోని తెలుగు వర్శిటీ బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. అనౌన్స్ మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉచిత ప్రయాణం కారణంగా మహిళలు వికలాంగులకు కేటాయించిన సీట్లలో సైతం కూర్చుంటున్నారనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించామని.. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవి అందుబాటులోకి వస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని సజ్జనార్ (Sajjanar) హామీ ఇచ్చారు.
విడతల వారీగా..
ప్రతీ రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ఇటీవల తెలిపారు. 'మహాలక్ష్మి' పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడంతో సంస్థ అధికారులను, సిబ్బందిని.. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రశంసించారని చెప్పారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్ ను చేపడతామని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని.. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనర్ వివరించారు.
Also Read: Ration Card E-Kyc: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - ఈ కేవైసీ గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?