TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
Telangana SSC Exams: కరోనా కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం.
ఇవాల్టి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆర్టీసీ బస్సులోనైనా పదో తరగతి విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రకటించింది. కేవలం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ ను చూపించి ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. పరీక్ష ముగిశాక కూడా ఎక్సామ్ సెంటర్ నుంచి ఇంటికి కూడా బస్సులో ఉచితంగా వెళ్లవచ్చని సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చాక ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గాలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఐదు నిమిషాల నిబంధన అమలు
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షలకు నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరై పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. విద్యార్థులు టైమ్ కి పరీక్ష కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్‌కు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలల్లో చదువుతున్న 5 లక్షల 9 వేల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 2861 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచునున్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా అప్రమత్తం అయింది. పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయి అధికారులతో సిట్టింగ్ స్కాడ్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే డీఈవో, ఎంఈవోలు బాధ్యత వహించాలని విద్యాశాఖ సూచించింది.