TSRTC Hike Bus Charges: తెల్లారేసరికల్లా ఆర్టీసీ ప్రయాణికులకు షాక్, టికెట్ ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ
టికెట్ ధరలు పెంచుతూ టీఆస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ పండుగరోజు ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం షాకిచ్చింది.
TSRTC hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు తెల్లారేసరికల్లా ప్రభుత్వం షాకిచ్చింది. పెంచిన టికెట్ ధరల్ని నేటి నుంచి అమలుచేస్తూ టీఆస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. టోల్‌ప్లాజా ధర టికెట్‌పై రూపాయి పెంచారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై రూ.2 మేర పెంచింది టీఆస్ఆర్టీసీ. పల్లె వెలుగు టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆస్ ఆర్టీసీ పేర్కొంది. పెరిగిన టికెట్ ఛార్జీలను వసూలు చేస్తున్న కండక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ ప్రకటన లేకుండా ఎక్కువ ఛార్జీలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రయాణికుల ప్రశ్నలకు కండక్టర్లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.
పల్లె వెలుగు ఛార్జీలు రౌండప్..
రాష్ట్రంలో పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చూసేందుకుగానూ ఛార్జీలను టీఎస్ ఆర్టీసీ సవరించింది. రూ.13 ఉన్న టికెట్ ధరను రూ.15 చేసింది. అలాగే రూ.17 ఉన్న టికెట్ ఛార్జీలను రూ.15కు రౌండర్ ఫిగర్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఉత్తర్వులలో ఆర్టీసీ పేర్కొనాల్సి ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో కొన్ని నెలల కిందట టీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను అమాంతం పెంచేసింది. తాజాగా టోల్ ప్లాజా రూ.1, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
సార్వత్రిక సమ్మె సైరన్..
దేశవ్యాప్తంగా ఈ మార్చి 28, 29న జరగనున్న సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ తమ కార్మికులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తెలిపింది. గత వారం జేఏసీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సంస్థ యాజమాన్యానికి నోటీసు అందించినట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి వారం కిందట తెలిపారు.
వారి డిమాండ్లు, సమస్యలు ఏమిటి..
మోటారు వాహనాల చట్టం-2019ను పునరుద్ధరించాలని, టూరిస్ట్ పర్మిట్ పాలసీని రద్దు చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులు, సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ సంఘాల పిలుపు మేరకు తెలంగాణలో సమ్మెను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి కోరారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పట్టించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Attack on Excise SI: ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై దాడి