TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఈ రమేష్ ను విచారిస్తున్న సిట్ అధికారులకు నిందితుడు అన్ని నిజాలను చెబుతున్నట్లు సమాచారం.
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేరప్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు షాకింగ్ విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. డీఈ రమేష్ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు కూడా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు వెల్లడి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచిన సిట్ అధికారులు ఇటీవల వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్న రమేష్ ను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణలో ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, డీఏఓ పరీక్షల ప్రశ్నాపత్రాలను 40 మందికి ఇవ్వడంతోపాటు హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించినట్లు తేలింది. ఈ క్రమంలోనే డీఈ రమేష్ ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు నాంపల్లి కోర్టు అనుమతితో అతడిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు.
75 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని మాస్ కాపీయింగ్
విచారణలో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ కూతురు రమేష్ ద్వారా ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాసినట్లు తేలింది. శ్రీనివాస్ ను కిలిసిన రమేష్ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడి అయింది. ఈక్రమంలోనే ఆ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాయగా... ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా ఆమెకు రమేష్ జవాబులు చేరవేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎంపీటీసీతో పాటు ఆయన కూతురును కూడా విచారించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
మూడ్రోజుల క్రితమే ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక దర్యాప్తు టీమ్ (SIT) టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దాంతో TSPSC Paper Leak కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరుకుంది. సోమవారం అరెస్టు అయిన వారిలో సైతం ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవి కిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రమేష్ సైతం మరో 20 మందికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు చెప్పాడు. కోచింగ్ సెంటర్లో పరిచయమైన వారికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు వివరాలు సేకరించారు. రమేష్ ఇచ్చిన సమాచారంతో సోమవారం నాడు ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.