TS TET 2023: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ
TS TET 2023: తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
TS TET 2023: తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. ఈసారి జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులని తెలిపారు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారని చెప్పారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని తెలిపారు.
డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను సెస్టెంబర్ 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు.
ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించామని చెప్పారు. కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. గురుకులాల్లో 12,150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్‌పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 567మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం
‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా..
ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది.