Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదం, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు
Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
![Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదం, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు TS High Court orders Dharmapuri election issue open strong room submit documents Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదం, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/09/7ad5dd3085f4aaae00a418dccbb1f1dd1681056353670235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dharmapuri Election Issue : జగిత్యాల జిల్లా ధర్మపురి గత సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి సమక్షంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి అందులోని డాక్యుమెంట్స్ ను నిర్ణీత తేదీలోగా హైకోర్టుకు అందజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగింది?
2018 సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్ ని నిర్ణీత తేదీలోగా హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఎన్నికల పిటిషన్‌ను అమలుచేయడంలో విఫలమయ్యారని హైకోర్టు ఆ మధ్య మల్కాజ్ గిరి డీసీపీకి సమన్లు జారీ చేసింది. అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిక్షపతి... పదవీ విరమణ చేసినా ఎన్నికల పిటిషన్‌పై సాక్ష్యాలను నమోదు చేసేందుకు హాజరుకాకపోవడంతో ఆయనపై గతంలో అరెస్ట్ వారెంట్ జారీచేసింది హైకోర్టు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని ఆరోపిస్తూ రీకౌంటింగ్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం మీద వాదనలు జారుతూనే ఉన్నాయి. రీకౌంటింగ్ పిటిషన్ అమలు చేయడంలో విఫలమైనందుకు అధికారులపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
441 ఓట్లతో కొప్పుల ఈశ్వర్ గెలుపు
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్లు ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే, సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో హడావుడి చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. సీనియర్ నేతగా పేరు ఉన్న కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. ఇంత చేసినప్పటికీ కేవలం 441 ఓట్ల మెజారిటీ మాత్రమే లభించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)