Smita Sabharwal : పరువు నష్టం కేసులో స్మితా సబర్వాల్ కు షాక్, రూ.15 లక్షలు తిరిగి కట్టాలని హైకోర్టు ఆదేశం
Smita Sabharwal : తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అవుట్ లుక్ మ్యాగజైన్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.
అవుట్ లుక్ పై పరువు నష్టం
2015లో అవుట్ లుక్ మ్యాగజైన్‌లో తన ఫొటోను అవమానకరంగా వేశారని స్మితా సబర్వాల్ ఆ మ్యాగజైన్ పై పరువు నష్టం దావా వేశారు. అయితే కోర్టు ఫీజుల కోసం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై అవుట్ లుక్, మరో ఇద్దరు వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.15లక్షలు తిరిగి చెల్లించాలని స్మితా సబర్మాల్‌కు ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో చెల్లించకపోతే ఆమె నుంచి వసూలు చేయాలని ప్రభుత్వానికి సూచన చేసింది. ఓ ప్రైవేటు సంస్థపై ప్రైవేటు వ్యక్తి కేసు వేస్తే అది ప్రజా ప్రయోజనం కాదని కోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని పేర్కొంది.
అసలేం జరిగింది?
2015లో స్మితా సబర్వాల్ తన పుట్టిన రోజున భర్తతో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు ఆమె వేసుకున్న దుస్తులని సూచిస్తూ అవుట్ లుక్ మ్యాగజైన్ ఓ ఫొటో ప్రచురించింది. అవుట్ లుక్ మ్యాగజైన్ తన ఫొటోను అవమానకంగా ప్రచురించిందని ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓ జాతీయ ఛానెల్‌తో ఈ వివాదంపై మాట్లాడారు. అవుట్ లుక్‌పై న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపై ఈ స్థాయిలో వేధింపులకు పాల్పడ్డారని, ఇంక సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందని ఆరోపించారు. ఇది మహిళా లోకంపై జరిగిన దాడి అని అప్పట్లో అన్నారు. తన తరఫు న్యాయవాది అవుట్ లుక్ మ్యాగజైన్ యాజమాన్యానికి నోటీసులు పంపారని తెలిపారు. అవుట్ లుక్ మ్యాగజైన్ తన సంచికలో నో బోరింగ్ బాబు అనే శీర్షికతో కామెంట్ ప్రచురించింది. స్మితా సబర్వాల్‌కు సంబంధించిన కార్టూన్ ను అభ్యంతరకరంగా పబ్లిష్ చేసింది. ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం హైకోర్టులో పరువునష్టం దావా వేశారు.