KCR News: మీ పిట్ట బెదిరింపులకు భయపడం, ఇవి అబద్ధమైతే వెంటనే రాజీనామా చేస్తా - కేసీఆర్ ఛాలెంజ్
దేశంలో తలసరి విద్యుత్ వినియోగం, ఆర్థిక పరిస్థితులు, బొగ్గు కాంట్రాక్ట్ ల గురించి లెక్కలతో సహా KCR వివరించారు. ఆ లెక్కలు అబద్ధమని తేలితే తాను రాజీనామా చేస్తానని సవాలు చేశారు.
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రతిపాదిత విద్యుత్ సంస్కరణ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి సంబంధించి దేశంలో తలసరి విద్యుత్ వినియోగం, ఆర్థిక పరిస్థితులు, బొగ్గు కాంట్రాక్ట్ ల గురించి లెక్కలతో సహా వివరించారు. ఆ లెక్కలు అబద్ధమని తేలితే తాను రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్ మాల్ మాటలేనని కొట్టిపారేశారు.
‘‘జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లయితే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,250 యూనిట్లు. చిన్న దేశాల కంటే మన దేశంలోనే విద్యుత్ వినియోగం తక్కువ. చిన్నదేశమైన భూటాన్ లాంటి దేశం కూడా విద్యుదుత్పత్తి, వినియోగంలో మనకంటే ముందు ఉంది. బీజేపీ ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్‌మాల్ గోవిందం మాటలే. సోలార్ పవర్ పేరుతో విద్యుత్ వ్యవస్థను పెద్ద పెద్ద వ్యాపారులకు అప్పగించేదుకు చర్యలు చేపడుతున్నారు. నేను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమని తేలితే క్షణంలో రాజీనామా చేస్తా. ప్రపంచంలో చెత్తను వాడుకుని అద్భుతంగా విద్యుత్ తయారు చేస్తున్నారు. మనమేమో ఇంకా చీకట్లోకి పోతున్నాం. తెలంగాణలో యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే మనకూ విద్యుత్ చాలా చవకగా లభిస్తుంది’’
విద్యుత్ వినియోగంలో దేశం దారుణం
‘‘రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనే అంశంపై ఆ రాష్ట్రాల ప్రగతి ఆధారపడి ఉంటుంది. మన దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4,07,178 మెగావాట్లు. బేస్ పవర్ లోడ్ 2,42,890 మెగావాట్లుగా ఉంది. ఈ దేశంలో ఇప్పటిదాకా అత్యధికంగా విద్యుత్ వినియోగించింది.. 2,10,793 మెగావాట్లు మాత్రమే. ఇటీవలే జూన్ 22న ఈ లెక్క నమోదైంది. బేస్ పవర్ లోడ్ అంటే కనీస విద్యుత్ వినియోగాన్ని కూడా మన దేశంలో వినియోగించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’’ అని కేసీఆర్ చెప్పారు.
మీ పిట్ట బెదిరింపులు పనిచేయవ్
‘‘కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్‌ఈసీ రుణాలు ఆపాలని కుట్ర చేస్తున్నారు. ఉదయ్ పథకంలో చేరాక ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది పౌరుషాల గడ్డ.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచెయ్యవ్. కరెంటు విషయంలో కేంద్రం బండారం అంతా బయటపెడతాం. తర్వాతి శీతాకాల సమావేశాలు అవసరమైతే 20 లేదా 25 రోజులు జరిపి కేంద్రం తీరును మొత్తం బయటపెడతాం.’’
మేకిన్ ఇండియా పూర్తిగా అబద్ధపు ప్రచారం..
బీజేపీకి దేశంలో ఎప్పుడూ 50 శాతం కూడా ఓట్లు రాలేదు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేశారు. ఇక మేకిన్ ఇండియా పూర్తిగా అబద్ధపు ప్రచారం. దారాలు, జాతీయ జెండాలు, పటాకులు, విగ్రహాలు అన్నీ చైనాలోనే తయారవుతున్నాయి. ఇది మేకిన్ ఇండియానా? ప్రధాని, అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది’’ అని కేసీఆర్ విమర్శించారు.