Kalyana Lakshmi Scheme: ‘కల్యాణ లక్ష్మి’ సరికొత్త రికార్డుపై TRS ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే..
Kalyana Lakshmi Scheme: దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం లబ్దిదారుల కుటుంబాల సంఖ్య 10 లక్షలు దాటింది.
Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం మరో కీలక మైలురాయిని దాటింది. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం లబ్దిదారుల కుటుంబాల సంఖ్య 10 లక్షలు దాటింది. ఏడేళ్ల కిందట ప్రారంభమైన ఈ పథకం విజయవంతంగా కొనసాగడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 10,56,239 మంది ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ‘దేశంలోనే తొలిసారిగా 2014లో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయంతో తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లి చేసే స్థితి నుండి ఆనందంగా పెండ్లి చేసే పరిస్థితి పేద కుటుంబాల్లో ఏర్పడిందని #మహిళాబంధు #MahilaBandhuKCR అని’ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
కళ్యాణలక్ష్మి పథకం..
తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి పథకం పథకం కింద రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టింది. మార్చి 13, 2017న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథకానికి ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. మార్చి 19, 2018న ఆ మొత్తాన్ని రూ.1,00,116 పెంచారు. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఏడేళ్ల నుంచి దిగ్విజయంగా..
ఏడేళ్ల కిందట ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ 10 లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయి. పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పు చేయకూడదని, వారి ఇళ్లల్లో సంతోషం నింపేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థిక సాయాన్ని అందించేవారు. తర్వాతిరోజుల్లో పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేశారు. 2017లో ఈ మొత్తాన్ని 75,116కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 19, 2018 నుంచి కల్యాణలక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1,00116 లకు పెంచడం తెలిసిందే.
ధరఖాస్తు విధానం
తెలంగాణ ఈపాస్ లో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్ళికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
నియమాలు - అర్హతలు
అర్హులైన యువతులు తమ వివాహానికి 30 రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి
దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు
ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు
వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)
Also Read: Hyderabad: ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు! 15 రోజుల పసికందు రూ.80 వేలకి.. కీలక పాత్రధారి ఆమెనే..