(Source: ECI/ABP News/ABP Majha)
TRS MLA ED : ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ! క్యాసినో లెక్కలా ? విదేశీ పెట్టుబడులా ?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఏ అంశంలో అన్నదానిపై స్పష్టత లేదు.
TRS MLA ED : ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయనకు నోటీసులు వచ్చిన విషయం కూడా బయటకు తెలియదు. దీంతో ఆయనను ఏ కేసులో విచారణకు పిలిచారన్నదానిపై ఆసక్తి ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కేసులోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పిలిచి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కానీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల పేర్లు కానీ ఎప్పుడూ బయటకు రాలేదు.
ఈడీ నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో నేరుగా హాజరు కావాలని ఆదేశాలు
మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు కొత్తవి కావని తెలుస్తోంది. ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి చాలా కాలం క్రితమే నోటీసులు వచ్చాయని దానికి ఆయన వివరణ ఇచ్చారని అంటున్నారు. అవి సంతృప్తికరంగా లేకపోవడంతో భౌతికంగా హాజరు కావాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే ఆయనను పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందానూ కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
హవాలా లావాదేవీలా ? విదేశీ పెట్టుబడులా ? అన్న అంశంపై సందిగ్ధత
అయితే కేసినోలకు వెళ్లే అలవాటు ఎమ్మెల్యేకు లేదని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ ఇతర వ్యాపార లావాదేవీల విషయంలోనూ ఆయనను పిలిపించి ఉంటుందని చెబుతున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇండోనేషియాలోని బంగారు గనుల్లో మంచిరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయని చెబుతున్నారు. ఆ పెట్టుబడుల్ని ఎలా తరలించారు.. అన్న అంశాన్ని విచారించేందుకే ఈడీ పీలిచిందని.. అంతకు మించిన విశేషం ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల్లో ఈడీ భయం !
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో ఈడీ భయం ఎక్కువగా ఉంది. పలువురికి ఈడీ నోటీసులు రావొచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరు కావడంతో ఆయన పై అందరి దృష్టి పడింది. అయితే ఆయన ఎప్పుడూ కీలకమైన పదవుల్లో లేరు. ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కారణంగా ఆయనకు వచ్చిన నోటీసుల్లో రాజకీయం లేదని.. ఆయన ఆర్థిక లావాదేవీల్లో అనుమానాస్పద అంశాలు ఉండటం కారణంగానే పిలిచి ఉంటారని భావిస్తున్నారు.
జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు