Revanth Reddy: ‘మోదీ రాక్షసుడు.. ఆ చట్టాలు అప్పుడే రద్దు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది’: రేవంత్ రెడ్డి
దేశంలో గుజరాత్ నుంచి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే క్రమంలో వ్యవసాయం అదానీ, అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారని విమర్శించారు.
ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ మూడు చట్టాలను మొదటి రోజే వెనక్కి తీసుకొని ఉంటే ఎంతో మంది రైతుల ప్రాణాలు మిగిలి ఉండేవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోదీ అని వ్యాఖ్యానించారు. రైతులు మోడీని క్షమించబోరని అన్నారు. వ్యవసాయం సంక్షోభానికి కారణం మోదీ, కేసీఆర్ అని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా రైతులు పోరాటం చేశారని రేవంత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారని అన్నారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరంతర దీక్షతో పోరాటం చేశారని గుర్తు చేశారు.
దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అదే క్రమంలో వ్యవసాయం అదానీ, అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారని చెప్పారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ పార్లమెంట్‌లో చట్టానికి అనుకూలంగా ఓటేయించారని గుర్తు చేశారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదు కానీ.. క్రెడిట్ మాత్రం తనదేనంటున్నారని, అది రైతులను అవమానించడమే అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరికో పుట్టిన పిల్లలకు కుల్ల కుట్టించినట్టు ఉంది కేసీఆర్ తీరు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.
3 కొత్త చట్టాలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ.
‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదింతలు పెంచాం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలే.. కానీ ఓ వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తోన్న రైతులు ఇక ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నాను.’’ అని ప్రధాని మోదీ మాట్లాడారు.
విజయం సాధించిన రైతులు
సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది కేంద్రం. దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగింది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది.
Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్