Revanth Reddy: ఆ 12మంది ఎమ్మెల్యేలపైనా సీబీఐ విచారణ చేపట్టాలి: రేవంత్ రెడ్డి
Revanth Reddy: పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ.. టీపీసీసీ నేతలు మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Revanth Reddy: పార్టీ ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఆధారాలతో టీపీసీసీ నేతల బృందం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా సీఎల్పీలో భేటీ అయిన నేతలు అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. 455 ఎఫ్ఐఆర్‌తో పాటు తాము ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించాలని తెలిపారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలని, కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ నేతల బృందం ఫిర్యాదు చేసే సమయంలో ఉన్నతాధికారులు లేకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఫిర్యాదు చేయడానికి వస్తే ఏసీపీ, సీఐ స్థాయి అధికారులు స్టేషన్ లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందుబాటులో ఉన్న ఎస్ఐ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.
కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి ఫిరాయించి పదవులు,ఆర్థిక ప్రయోజనాలు పొందిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
— Revanth Reddy (@revanth_anumula) January 6, 2023
సీబీఐ చేపట్టిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు విచారణలో,మేం ఇచ్చిన ఆధారాలతో అవినీతి నిరోధక చట్టం కింద వారి పైన,వాళ్లను ప్రలోభపెట్టిన కేసీఆర్ కు శిక్షపడాలి pic.twitter.com/JL3qP1WDfr
పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారన్నారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారని చెప్పుకొచ్చారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారని రేవంత్ మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పిర్యాదు చేసినా స్పీకర్ న్యాయ బద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిందన్నారు.
డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తాం..
ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని... అయితే కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయని గుర్తు చేశారు రేవంత్. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, కేవలం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు రేవంత్. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అవసరమైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికి కూడా వెనకాడమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.