Top 10 Headlines Today: తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం - కులగణనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సీఎం జగన్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా ముఖ్యమైన వార్తలు మీకోసం.
Top 10 Headlines Today:
తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం మహేశ్వరం, వికారాబాద్, పటాన్ చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని సుల్తాన్ పూర్ సభలో పాల్గొంటారు. మరోవైపు, మంత్రి కేటీఆర్ రోడ్ షోల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఆయన, నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలోని రోడ్ షో నిర్వహించనున్నారు.
నేడు 6 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు దుబ్బాక బహిరంగ సభ, మధ్యాహ్నం 12:30 గంటలకు హుజూరాబాద్, 2 గంటలకు మానుకొండూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మహేశ్వరం, 4 గంటలకు ఎల్బీ నగర్, 5 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
నేడు తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో నేడు బీజేపీ అగ్రనేతలు పర్యటించనున్నారు. జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, పియూష్ గోయల్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగించనున్నారు. ఖైరతాబాద్ సెగ్మెంట్ లో ప్రమోద్ సావంత్ పాదయాత్ర నిర్వహించనున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నిఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తలతో పీయూష్ గోయల్ సమావేశమవుతారు. అటు, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
తెలంగాణలో నేడు, రేపు ఈవీఎంల తనిఖీలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేటాయించిన ఈవీఎంలను గురు, శుక్రవారాల్లో తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రానికి 72,931 బ్యాలెట్ యూనిట్లు, 57,592 కంట్రోల్ యూనిట్లను ఈసీ రాష్ట్రానికి కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో 59,799 బ్యాలెట్ యూనిట్లను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన వాటిని రిజర్వులో ఉంచనున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం ఇచ్చి, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి సీల్ వేసి పోలింగ్ ప్రక్రియలో వినియోగించనున్నారు.
నేడు ఏపీలో వైఎస్సాఆర్ కల్యాణమస్తు
ఏపీ ప్రభుత్వం గురువారం వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లలకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.
ఏపీలో డిసెంబర్ 3లోపు కులగణన పూర్తి
రాష్ట్రంలో కుల గణనను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఈ సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్లలో ప్రత్యేక యాప్ రూపొందించారు.
విశాఖ భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ కు భారీ బందోబస్తు
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి ట్వంటీ-20 (T20) సమరానికి విశాఖలోని V.C.A-V.D.C.A స్టేడియం సిద్ధమైంది. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే డే అండ్ నైట్ మ్యాచ్ కు సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. సుమారు 28 వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి ఈ స్టేడియంలో సామర్ధ్యం ఉంది. 30కు పైగా గేట్లు ద్వారా లోపలలకు ప్రవేశించే అవకాశం ఉంది. దాదాపు 2 వేల మంది భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
డీఫ్ ఫేక్ వీడియోలపై కేంద్రం కఠిన చర్యలు - నేడు సమావేశం
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రముఖుల గౌరవానికి భంగం కలిగించేలా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో గురువారం కేంద్రం సమావేశం నిర్వహించనుంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వారితో భేటీ అయి చర్చలు జరుపుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు, వీటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
చివరి దశకు ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. 11 రోజులుగా ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను గురువారం ఉదయానికల్లా బయటకు తీసుకురానున్నారు. ఇప్పటికే 15 మంది సభ్యుల NDRF బృందం సొరంగంలోకి చేరుకుంది. దాదాపు 45 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. మరో 12 మీటర్ల శిథిలాల గుండా భారీ పైపులను పంపుతున్నారు. వీటి ద్వారా లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొస్తారు.
మంచు విష్ణు 'భక్త కన్నప్ప' ఫస్ట్ లుక్ రిలీజ్
డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప'. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది ఉపశీర్షిక. గురువారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యోధుడిగా, అపర భక్తుడిగా కన్నప్ప లుక్ ఆకట్టుకుంటోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది.