TGSRTC Ticket Charges Hike: తెలంగాణలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచలేదు - కానీ పురుషుల జేబుకు చిల్లు, కారణం ఏంటంటే!
TGSRTC Charges Hike: తెలంగాణలో ఆర్టీసీలో ప్రయాణికుల బస్సు ఛార్జీలు పెరిగాయన్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. తాము సాధారణ ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Telangana RTC Charges Hikes News: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు (TSRTC Charges Hikes) పెంచిందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల హైవే మీద టోల్ ప్లాజా ఛార్జీలు పెంచగా.. అన్ని జాతీయ రహదారులపై టోల్ రుసుము పెరిగింది. దాంతో టోల్ ప్లాజా ఉన్న మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై రూ.3 చొప్పున ఛార్జీ పెరిగినట్లు బుధవారం ఉదయం నుంచి వైరల్ అయింది. అయితే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనే వార్తలో నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) స్పష్టం చేసింది. చార్జీలు యథాతథంగానే ఉన్నాయని బుధవారం (జూన్ 12న) ఓ ప్రకటనలో ఆర్టీసీ వెల్లడించింది.
టోల్ సెస్ సవరించినట్లు ఆర్టీసీ క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెంచలేదు. ప్రయాణికుల చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. అయితే హైవేలపై టోల్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచగా.. ఈ మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించింది. ఈ సవరించిన టోల్ సెస్ జూన్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అది కూడా టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. కానీ సోషల్ మీడియాలో ప్రచారం అయినట్లుగా.. సాధారణ రూట్లలో ప్రయాణికుల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు అని సంస్థ స్పష్టం చేసింది.
ఎలాగైతేనేం.. ఆ ఛార్జీల భారం ఎవరిపై పడుతోంది?
టోల్ గేట్ ఉన్న జాతీయ రహదారి మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఆ మార్గాల్లో నడిచే బస్సుల్లో కేంద్రం పెంచిన టోల్ ట్యాక్స్‌కు అనుగుణంగా టోల్ సెస్ మాత్రమే పెంచినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా అది ప్రయాణికులపై భారంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఉంది కనుక, పురుషుల జేబుకు చిల్లు పడుతోంది. ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు సిటీ బస్సుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేస్తున్నారు.
టికెట్ చార్జీల్లో టోల్ రుసుము రూ.3 చొప్పున ఆర్టీసీ పెంచింది. దాంతో గత వారం వరకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్ ట్యాక్స్ ఇప్పుడు రూ.13కు చేరింది. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు, రాజధాని బస్సులు, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను టోల్ సెస్ రూ.16కు సవరించింది ఆర్టీసీ. అదే విధంగా గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 ఉన్న టోల్ సెస్ ఛార్జీని రూ.17కు, నాన్ ఏసీ స్లీపర్ బస్సులు, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ. 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో టోల్ సెస్ ఛార్జీ రూ.20 నుంచి రూ.23కు చేరింది. అయితే టోల్ సెస్ సవరించాం, కానీ డైరెక్టుగా ప్రయాణికుల బస్సు టికెట్ లపై ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది.
Also Read: కరెంటు మంచిగా వస్తుందా? ఆర్టీసీ బస్సెక్కిన డిప్యూటీ సీఎం, సామాన్యులతో ముచ్చట్లు