Telangana News: దేశంలోనే తెలంగాణకు టాప్ ప్లేస్, ఏడేళ్లలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా
రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటుపై కేంద్ర గణాంకాల శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, భారీ స్థాయిలో వృద్ధి రేటు నమోదు అయింది.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అరుదైన గర్తింపు పొందింది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. తెలంగాణ 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి), తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో వృద్ధి రేటు నమోదు చేసినట్లు కేంద్ర గణాంకాల శాఖ - ఎంఓఎస్‌పీఐ (MOSPI) వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటును కేంద్ర గణాంకాల శాఖ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, భారీ స్థాయిలో వృద్ధి రేటు నమోదు అయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో 19.46 శాతం వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధి రేటు నమోదు అయింది.
Also Read: Gold-Silver Price: బంగారం ధర భారీ షాక్! ఇలాగైతే అస్సలు కొనలేం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమే
2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో 12.02 శాతం వృద్ధిరేటు నమోదు కాగా, తలసరి ఆదాయం 10.65 శాతం వృద్ధి రేటు నమోదు అయినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్‌డీపీలో 2.25 శాతం, తలసరి ఆదాయంలో 1.64 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్‌డీపీలో 16.85 శాతం వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో 17.14 శాతం వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల్లో రూ.1,154,860 కోట్లుగా, తలసరి ఆదాయాన్ని రూ. 2,78,833గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (MOSPI) సోమవారం ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 2.25 శాతం మాత్రమే కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. జీఎస్‌డీపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 16.85 శాతం అధిక వృద్ధి రేటు సాధించింది. తలసరి ఆదాయంలో వృద్ధి రేటు గత ఏడాది కంటే 17.14 శాతం ఎక్కువ సాధించింది.
Also Read: KCR Delhi Tour: నేడు కేసీఆర్ - కేజ్రీవాల్ భేటీ? బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌పైనే చర్చలు!