TS EWS Reservations: తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు ఓకే.. ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు 10 % రిజర్వేషన్లు అమలుపై మార్గదర్శకాలు ఖరారు చేసింది.
![TS EWS Reservations: తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు ఓకే.. ప్రభుత్వం ఉత్తర్వులు Telangana releases norms for EWS quota; 33% jobs for women TS EWS Reservations: తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు ఓకే.. ప్రభుత్వం ఉత్తర్వులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/25/2dcf5c97d6a2dea8898f51f72f21648e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలోని అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కుటుంబ వార్షికాదాయం 8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది.
వార్షిక ఆదాయాన్ని సూచించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులను ఎంపిక చేస్తారు. తహసీల్దార్లు ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారు. ఈ ధ్రువపత్రం తప్పని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా పరిగణనలోకి..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరే వ్యక్తితోపాటు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు (18 ఏళ్ల లోపు), జీవిత భాగస్వామి, సంతానాన్ని (18 ఏళ్ల లోపు) కలిపి ఒక కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక తోబుట్టువులు, సంతానం 18 ఏళ్లపైన వయసు కంటే ఎక్కువ ఉన్న వారైతే.. వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు.
మహిళలకు 33.33 శాతం కోటా..
ఇక ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు ప్రత్యేక కోటా ఉంది. మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈడబ్ల్యూఎస్ వారికి నియామకాల్లో 5 ఏళ్ల వయోపరిమితి అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో వీరికి పరీక్ష రుసుముల్లో మినహాయింపులను అందిస్తారు.
రోస్టర్ పాయింట్లను కూడా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేసింది. ప్రతి 100 ఖాళీల భర్తీలో.. 9, 17 (మహిళలు), 28, 36, 50 (మహిళలు), 57, 65 (మహిళలు), 76, 86, 100 స్థానాల్లో వీటిని కేటాయిస్తారు.
ఇక ఏదైనా రిక్రూట్‌మెంట్ ఇయర్ లో సరైన అర్హత లేక ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులు భర్తీ కాకుంటే.. ఆ పోస్టులను తర్వాతి నియామక సంవత్సరానికి బ్యాక్‌లాగ్ పోస్టుగా బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వికలాంగులు లేదా ఎక్స్‌సర్వీ స్‌మెన్ కోటా కింద ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వ్యక్తులెవరైనా ఎంపికైతే.. వారికి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ వర్తింపజేయాలని సూచించింది.
త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీచేయడంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీ నోటిపికేషన్లు వెలువడనున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)