Telangana News: 'మాపై ఏదైనా కేసు ఉందా?' - ఎన్నికల వేళ రాజకీయ నేతల గుబులు, వివరాలివ్వాలని అభ్యర్థనలు
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ పలు పార్టీల నేతలు తమపై ఉన్న కేసుల వివరాల కోసం పోలీసులను సంప్రదిస్తున్నారు. పూర్తి నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు రాజకీయ నేతల విస్తృత ప్రచారం, మరో వైపు పోలీసుల ముమ్మర తనిఖీలతో రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో పలువురు నేతలకు కేసుల గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో తమపై ఏ ఠాణాలో ఏ కేసు నమోదైందో తెలుసుకోవాలని వారంతా ఆరాటపడుతున్నారు. ఈ మేరకు తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ డీజీపీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో అన్ని ప్రధాన పార్టీల నేతలూ ఉన్నారు. దీంతో ఆయా నేతల కేసుల జాబితాను తయారు చేసే పనిలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) నిమగ్నమైంది. సీఐడీ ఆధీనంలోని ఈ విభాగానికి ఆయా నేతల వ్యక్తిగత కార్యదర్శులు లేదా అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో తమపై నమోదైన కేసుల వివరాలు, పూర్తైనవి, ఇప్పటివరకూ పెండింగ్ ఉన్నవి తెలపాలని కోరుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై నమోదు చేసిన కేసుల వివరాలను దాచి పెడుతున్నారంటూ ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. కేసుల వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చేలా ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో SCRB నివేదిక రూపొందించింది.
ఆదమరిస్తే అంతే
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో అఫిడవిట్ సమర్పించేటప్పుడు పలు వివరాలు నమోదు చేయాలి. ఆ సమయంలో ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు కేసుల వివరాలు కూడా ముఖ్యం. ఒకవేళ, కేసుల వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినట్లు తేలితే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థులు కేసుల విషయంలో ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో నామినేషన్లకు ముందే అప్రమత్తమవుతున్న నేతలు పకడ్బందీ ప్రణాళికల్లో తలమునకలవుతున్నారు.
24 గంటల్లో రూ.42 కోట్లు స్వాధీనం
మరోవైపు, ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భాగంగా 24 గంటల్లో రాష్ట్రంలో రూ.42 కోట్లకు పైగా విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పోలీస్ శాఖ రూ.8,08,02,770 నగదు, రూ.31,73,528 విలువైన మద్యం స్వాధీనం చేసుకుంది. అబ్కారీ శాఖ సైతం రూ.1,68,45,982 విలువైన మద్యం పట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాలూ కలిపి రూ.1,99,86,070 విలువైన మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 38.24 కిలోల బంగారం, 189.75 కిలోల వెండి, 186.195 క్యారెట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినంతో పాటు బియ్యం, చీరలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 11 రోజుల్లో మొత్తం రూ.286 కోట్లకు పైగా విలువైన సొత్తును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ ఎన్నికలు - 2 రోజుల్లో రంగంలోకి 20 వేల కేంద్ర బలగాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

